gopala gowda
-
భూసేకరణ జీవో చెల్లదు
తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్ 118, పార్లమెంట్ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్లో జస్టిస్ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు. భూసేకరణ అనేది హౌసింగ్ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్ గోపాలగౌడ దుయ్యబట్టారు. రైతుల్ని వేధిస్తూ భూసేకరణ రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలి! పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. -
అమరావతిలో అరాచకం
-
ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఉందా ?
-
ఏపీలో అరాచక పాలన
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. రైతులు, రైతు కూలీలను బెదిరించి బలవంతంగా భూములు గుంజుకుంటోంది. గతంలో రైతుల బతుకులను నాశనం చేసిన చక్రవర్తులు, పాలెగాళ్లు, భూస్వాములు మట్టి కొట్టుకుపోయారు. ప్రస్తుత ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది’’ అని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం రాజ్యాంగ విరుద్ధం అని కుండబద్దలు కొట్టారు. భూములను లాక్కునేందుకు ప్రభుత్వం అన్ని చట్టాలనూ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. రాజధానితోపాటు వివిధ ప్రాంతాల్లో భూములు లాక్కునేందుకు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, రైతులు బెదరొద్దని ఆయన ధైర్యం చెప్పారు. విజయవాడలో ఆదివారం ‘సుస్థిర అభివృద్ధి–భూసేకరణ–రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు తమ సందేహాలను లేవనెత్తారు. వాటన్నింటిపై జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ మాట్లాడారు. సదస్సులో గోపాల గౌడ ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఈ రోజు ఉదయం అమరావతి ప్రాంతంలో పర్యటించాను. అడుగడుగునా పోలీసులే ఉన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పాలన ఉందా? లేదా? రాజధానిలో ప్రజలపై ఆంక్షలు ఏమిటి? మనం రాజరిక పాలనలో, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో రైతులు, రైతు కూలీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి పరిపాలన సాగిస్తున్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణం. రైతులు, రైతు కూలీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయాలని చూసే ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది. రైతులకే రక్షణ లేకపోతే ఎలా? ఈ రాష్ట్రంలో పాలన చూస్తుంటే మనకు రాజ్యాంగం ఉందా? లేదా? అనిపిస్తోంది. అంతా రాష్ట్రం ఇష్టమేనా? రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంతా రాష్ట్రం ఇష్టమేనా? ఏపీ రాజధాని ప్రాంతం ఎంపికే రాజ్యాంగబద్ధంగా జరగలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని ఎంపిక కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి రాజధాని ఎంపిక కోసం సిఫార్సులు చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే కృష్ణా, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిగా చేయొద్దని స్పష్టం చేసింది. ఆ కమిటీ నివేదికపై కేంద్రం ఏం చేసింది? శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని అధికారికంగా వెల్లడించిందా? ఆ సిఫార్సులపై అభ్యంతరం ఉంటే మరో కమిటీని నియమించాలంటూ కేంద్రాన్ని కోరాలి. కానీ, అలా చేయలేదు. అలాంటప్పుడు ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించాల్సిందే. అలా చేయలేదంటే రాజ్యాంగ ధర్మాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లే. కోన్ కిస్కా సింగపూర్ కంపెనీ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళిక రూపొందించమని సింగపూర్ కంపెనీకి ఇవ్వడం ఏమిటి? అసలు సింగపూర్ ఎంత ఉంది. అది చిన్న ద్వీపం. అందులో ఓ కోన్ కిస్కా కంపెనీకి రాజధాని అభివృద్ధి ప్రణాళిక తయారు చేయమని అప్పగిస్తారా? మన దగ్గర ఎంతోమంది నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు. వారిని వదిలేసి ప్లాన్ తయారు చేయమని సింగపూర్ వాడికి ఇస్తారా? అందుకు వాడికి 4 వేల ఎకరాలు అప్పగిస్తారా? రైతులను బెదిరించి తీసుకున్న 33 వేల ఎకరాల్లో 4 వేల ఎకరాలు ఇచ్చేస్తారా? ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ఇలా ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదని 1979లో రమణదయాళ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. భయపడొద్దు... పోరాడండి రాజధానిలో ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను బెదిరిస్తోంది. ఎవరూ భయపడాల్సిన పని లేదు. భూసేకరణ చట్టానికి సవరణ చేయాలన్న ఏపీ ప్రభుత్వ యత్నాలు ఫలించవు. రాష్ట్ర శాసనసభకు ఆ అధికారం లేదు. న్యాయ పోరాటం చేయండి. ఒక కోర్టులో కాకపోయినా మరో కోర్టులో అయినా మీకు న్యాయం జరుగుతుంది. మూడు పంట లు పండే భూములపై తప్పుడు నివేదికలు ఇచ్చిన ప్రభుత్వంపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయి. నివేదిక ఇచ్చిన అధికారులకు జైలు శిక్ష పడుతుంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేయొచ్చు’’ అని గోపాల గౌడ పిలుపునిచ్చారు. ల్యాండ్ పూలింగ్ రాజ్యాంగ విరుద్ధం రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంట్ ‘భూసేకరణ చట్టం–2013’ చేసింది. ఆ చట్టాన్ని కాదని ఏపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల భూములు తీసుకోవడం ఏమిటి? ల్యాండ్ పూలింగ్ విధానం రాజ్యాంగ విరుద్ధం. భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలి. అందుకోసం సహాయ, పునరావాస ప్రక్రియను కచ్చితంగా పాటించాలి. అసలు రాజధానిలో భూములు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ తెచ్చిన నిబంధనలు పాటించిందా? గ్రామసభలు నిర్వహించారా? తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు? ఎంతమంది ఆమోదించారు? ఎంతమంది వ్యతిరేకించారు? ముందుగా సోషల్ ఇంపాక్ట్ రిపోర్టు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ నివేదికలను గ్రామసభల్లో చూపించారా? పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా అంటే అసైన్డ్ భూములు ప్రభుత్వానివే అని చెబుతోంది. అది పూర్తిగా తప్పు. అసైన్డ్ భూములు అంటూ ఒకసారి ఇచ్చిన తరువాత అవి సాగు చేసుకుంటున్నవారికే చెందుతాయి. నా మాటలను ప్రభుత్వానికి నివేదించండి ‘‘ఈ భేటీలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఉంటారని నాకు తెలుసు. నేను సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తినే కాదు, రాజ్యాంగబద్ధుడైన పౌరుడిని కూడా. నేను మాట్లాడే మాటలన్నీ రాజ్యాంగానికి, న్యాయ సూత్రాలకు లోబడి సామాజిక ప్రయోజనాలకు ఉద్దేశించినవే. నా మాటలను మీరు ప్రభుత్వానికి నివేదించండి. అప్పుడైనా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకుంటుందేమో’’ అని జస్టిస్ గోపాలగౌడ చెప్పారు. -
‘తీర్పు ఇవ్వడానికి జడ్జిలకు మనసుండాలి’
న్యూఢిల్లీ: కేవలం మెదడుతో చేసే పనివల్ల న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేయలేరనీ, వారికి మనసుండాలనీ, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దవే అన్నారు. బుధవారం జరిగిన జస్టిస్ వి.గోపాల గౌడ వీడ్కోలు సభలో ఆయన ఈ మాటలన్నారు. గోపాల గౌడ మనసుతో తీర్పులిచ్చిన న్యాయమూర్తి అని ప్రశంసించారు. కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ (ఎస్సీబీఏ) నిర్వహించింది. జస్టిస్ గౌడ మాట్లాడుతూ రైతుల హక్కులను పరిరక్షించాలని యువ న్యాయవాదులను కోరారు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే రైతులే కారణమనీ, నష్టాలు వస్తున్నా ఏ ప్రతిఫలం ఆశించకుండా తిండి గింజలు పండిస్తున్న అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ఇతర న్యాయమూర్తులను అభ్యర్థించారు. 2012లో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన గౌడ బుధవారం పదవీ విరమణ చేశారు. -
వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
► సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ► ‘భారత రాజ్యాంగం-పనితీరు’ సమావేశంలో ప్రసంగం సాక్షి, హైదరాబాద్: ‘‘ఎరువులు, పురుగు మందులకు స్థిరమైన ధర ఉంటోంది. కానీ రైతు పండించే పంటకు స్థిరమైన ధర ఉండటం లేదు. ఇది సరి కాదు. రైతులను ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగితే దేశం కుప్పకూలుతుంది. రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.. రైతుకు 4 గంటల విద్యుత్‌ను అందించలేకపోతున్నాయి. కానీ పరిశ్రమలకు18 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత న్యాయవాదుల యూని యన్ (ఐలూ) మాజీ అధ్యక్షుడు దివంగత అనంతారెడ్డి గౌరవార్థం ఐలూ, ఇక్ఫాయ్ సంయుక్తంగా ‘భారత రాజ్యాంగం-పనితీరు’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జస్టిస్ గోపాలగౌడ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రైతు అభివృద్ధికి భూమి ఎంతో దోహదపడుతుందన్నారు. తన తండ్రి రైతు కావడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఆస్తి హక్కు మానవ హక్కు... ‘‘భూమి కలిగి ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆస్తి హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థపై ఎంతైనా ఉంది’’ అని జస్టిస్ గోపాలగౌడ స్పష్టం చేశారు. ‘‘1991 తర్వాత వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, 1894 భూసేకరణ చట్టం వల్ల వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. అయినా దీని రక్షణకు రాజ్యాంగం పూర్తిస్థాయిలో దోహదపడలేదు’’ అని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు. సమావేశానికి ఐలూ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు జి. విద్యాసాగర్ అధ్యక్షత వహించగా కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎన్. బుసి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతారెడ్డి భార్య సుశీలాదేవి, కుమార్తె విజయారెడ్డి, ఐలూ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, హైకోర్టు ఏపీ, తెలంగాణ బార్ అసోసియేషన్స్ అధ్యక్షులు సి.నాగేశ్వర్రావు, గండ్ర మోహన్‌రావు పాల్గొన్నారు.