సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ గోపాల గౌడ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. రైతులు, రైతు కూలీలను బెదిరించి బలవంతంగా భూములు గుంజుకుంటోంది. గతంలో రైతుల బతుకులను నాశనం చేసిన చక్రవర్తులు, పాలెగాళ్లు, భూస్వాములు మట్టి కొట్టుకుపోయారు. ప్రస్తుత ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది’’ అని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం రాజ్యాంగ విరుద్ధం అని కుండబద్దలు కొట్టారు. భూములను లాక్కునేందుకు ప్రభుత్వం అన్ని చట్టాలనూ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. రాజధానితోపాటు వివిధ ప్రాంతాల్లో భూములు లాక్కునేందుకు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, రైతులు బెదరొద్దని ఆయన ధైర్యం చెప్పారు. విజయవాడలో ఆదివారం ‘సుస్థిర అభివృద్ధి–భూసేకరణ–రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు తమ సందేహాలను లేవనెత్తారు. వాటన్నింటిపై జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ మాట్లాడారు. సదస్సులో గోపాల గౌడ ప్రసంగం ఆయన మాటల్లోనే...
‘‘ఈ రోజు ఉదయం అమరావతి ప్రాంతంలో పర్యటించాను. అడుగడుగునా పోలీసులే ఉన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పాలన ఉందా? లేదా? రాజధానిలో ప్రజలపై ఆంక్షలు ఏమిటి? మనం రాజరిక పాలనలో, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో రైతులు, రైతు కూలీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి పరిపాలన సాగిస్తున్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణం. రైతులు, రైతు కూలీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయాలని చూసే ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది. రైతులకే రక్షణ లేకపోతే ఎలా? ఈ రాష్ట్రంలో పాలన చూస్తుంటే మనకు రాజ్యాంగం ఉందా? లేదా? అనిపిస్తోంది.
అంతా రాష్ట్రం ఇష్టమేనా?
రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంతా రాష్ట్రం ఇష్టమేనా? ఏపీ రాజధాని ప్రాంతం ఎంపికే రాజ్యాంగబద్ధంగా జరగలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని ఎంపిక కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి రాజధాని ఎంపిక కోసం సిఫార్సులు చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే కృష్ణా, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిగా చేయొద్దని స్పష్టం చేసింది. ఆ కమిటీ నివేదికపై కేంద్రం ఏం చేసింది? శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని అధికారికంగా వెల్లడించిందా? ఆ సిఫార్సులపై అభ్యంతరం ఉంటే మరో కమిటీని నియమించాలంటూ కేంద్రాన్ని కోరాలి. కానీ, అలా చేయలేదు. అలాంటప్పుడు ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించాల్సిందే. అలా చేయలేదంటే రాజ్యాంగ ధర్మాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లే.
కోన్ కిస్కా సింగపూర్ కంపెనీ
రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళిక రూపొందించమని సింగపూర్ కంపెనీకి ఇవ్వడం ఏమిటి? అసలు సింగపూర్ ఎంత ఉంది. అది చిన్న ద్వీపం. అందులో ఓ కోన్ కిస్కా కంపెనీకి రాజధాని అభివృద్ధి ప్రణాళిక తయారు చేయమని అప్పగిస్తారా? మన దగ్గర ఎంతోమంది నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు. వారిని వదిలేసి ప్లాన్ తయారు చేయమని సింగపూర్ వాడికి ఇస్తారా? అందుకు వాడికి 4 వేల ఎకరాలు అప్పగిస్తారా? రైతులను బెదిరించి తీసుకున్న 33 వేల ఎకరాల్లో 4 వేల ఎకరాలు ఇచ్చేస్తారా? ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ఇలా ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదని 1979లో రమణదయాళ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
భయపడొద్దు... పోరాడండి
రాజధానిలో ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను బెదిరిస్తోంది. ఎవరూ భయపడాల్సిన పని లేదు. భూసేకరణ చట్టానికి సవరణ చేయాలన్న ఏపీ ప్రభుత్వ యత్నాలు ఫలించవు. రాష్ట్ర శాసనసభకు ఆ అధికారం లేదు. న్యాయ పోరాటం చేయండి. ఒక కోర్టులో కాకపోయినా మరో కోర్టులో అయినా మీకు న్యాయం జరుగుతుంది. మూడు పంట లు పండే భూములపై తప్పుడు నివేదికలు ఇచ్చిన ప్రభుత్వంపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయి. నివేదిక ఇచ్చిన అధికారులకు జైలు శిక్ష పడుతుంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేయొచ్చు’’ అని గోపాల గౌడ పిలుపునిచ్చారు.
ల్యాండ్ పూలింగ్ రాజ్యాంగ విరుద్ధం
రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంట్ ‘భూసేకరణ చట్టం–2013’ చేసింది. ఆ చట్టాన్ని కాదని ఏపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల భూములు తీసుకోవడం ఏమిటి? ల్యాండ్ పూలింగ్ విధానం రాజ్యాంగ విరుద్ధం. భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలి. అందుకోసం సహాయ, పునరావాస ప్రక్రియను కచ్చితంగా పాటించాలి. అసలు రాజధానిలో భూములు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ తెచ్చిన నిబంధనలు పాటించిందా? గ్రామసభలు నిర్వహించారా? తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు? ఎంతమంది ఆమోదించారు? ఎంతమంది వ్యతిరేకించారు? ముందుగా సోషల్ ఇంపాక్ట్ రిపోర్టు, ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ నివేదికలను గ్రామసభల్లో చూపించారా? పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా అంటే అసైన్డ్ భూములు ప్రభుత్వానివే అని చెబుతోంది. అది పూర్తిగా తప్పు. అసైన్డ్ భూములు అంటూ ఒకసారి ఇచ్చిన తరువాత అవి సాగు చేసుకుంటున్నవారికే చెందుతాయి.
నా మాటలను ప్రభుత్వానికి నివేదించండి
‘‘ఈ భేటీలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఉంటారని నాకు తెలుసు. నేను సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తినే కాదు, రాజ్యాంగబద్ధుడైన పౌరుడిని కూడా. నేను మాట్లాడే మాటలన్నీ రాజ్యాంగానికి, న్యాయ సూత్రాలకు లోబడి సామాజిక ప్రయోజనాలకు ఉద్దేశించినవే. నా మాటలను మీరు ప్రభుత్వానికి నివేదించండి. అప్పుడైనా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకుంటుందేమో’’ అని జస్టిస్ గోపాలగౌడ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment