దృశ్యాలు వేర్వేరు.. కొన్ని ఆవహిస్తే.. కొన్ని ఆపేస్తాయి.. మరికొన్ని మాత్రం ఊపేస్తుంటాయి. కళ్లతో ఏడిస్తే బాధ రాలిపోతుంది.. గుండెతో ఏడిస్తే మిగిలిపోతుంది. కొన్ని సంఘటనలు కళ్లముందు గంటలకొద్దీ జరిగినా భౌతికంగా, మానసికంగా చలనం కలిగించలేవు. మరొకొన్ని మాత్రం రెప్పపాటు కాలంలో కళ్లకు కనిపించినా అవి గుండెను తట్టి లేపి ఎదురుగా నిల్చోబెడతాయి. ఆ సమయంలో అనిపిస్తుంటుంది ఓసారి మనిషిగా స్పందిస్తే బాగుంటుంది కదా! సరిగ్గా ఈ దృశ్యం చూసిన ఎవరికైనా బహుశా..! అలాగే అనిపించవొచ్చేమో.
హైదరాబాద్ నగరం.. ఎప్పుడూ ఉరుకులు పరుకులు. అయినవాళ్లు కనిపించినా.. ఆ ఏముందిలే అన్నంతగా మసిబారిపోయిన మనుసులు. నిర్లక్ష్యంతో కాదుగానీ పరిస్థితులు అలాంటివి. ఇలాంటి స్థితిలోనూ మనసును తొక్కిపట్టే ఓ సన్నివేశం కనిపిస్తే.. అది ఆరోజంతా ఆలోచింపజేస్తే.. స్పందించకుండా ఉండటం సాధ్యమేనా! ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్ నగర్ సిగ్నల్ చౌరస్తా.. మరో 18 సెకన్లలో సిగ్నల్ పడుతుంది. అప్పుడే టైం ఎంతయిందో చూద్దామని చేతిలో మొబైల్ ఫోన్. టెన్షన్ గా అటూ ఇటూ చూడగా ఓ చోట చూపు ఆగిపోయింది.
గబగబా రెండు ఫొటోలు. ఆ చౌరస్తాలోని ఓ ఫుట్‌పాత్పై కిందపరిచిన గోనెసంచి.. దానిమీద పరిచిన పూలు వాటిపక్కన ముసలవ్వ.. ఆమెకు పక్కనే కూర్చున్న ఓ తొమ్మిదేళ్ల పాప. వాహనాల చప్పుడు, పొగ, అరుపులు కేకలు ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్స్ ఏవీ కూడా ఆ పాప ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. నోట్సుపై ఏవో రాస్తుంటే తన తలరాతే రాసుకుంటోందా అనిపించింది. ఒకప్పుడు మహానుభావులు రాత్రివేళ వీధిదీపాల కింద కూర్చుని చదువుకున్నారని చెబితే విన్నాం.. కానీ ఈ చిట్టి చదువుల తల్లి మాత్రం నిజంగానే వీధిలోని ఫుట్ పాత్ పై కూర్చుంది. కానీ రాత్రి కాదు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో. మరో గంట ఆగితే సూర్యాస్తమయం అయిపోతుంది.
అయినా చక్కగా ఒదిగిపోయి పుస్తకంలో దూరిపోయి సూటిగా పుస్తకాల్లోని అక్షరాలను చేతిరాతతో వల్లె వేసుకుంటోంది. అంత ఏకాగ్రత మధ్యనే పూల కోసం వచ్చినవారికి ఇచ్చి.. క్షణంలోనే తిరిగి పుస్తకంలో వాలిపోయింది. ఆ పాప పేరు దుర్గ. ఇంత చిన్నవయసులోనే జీవితం తన ముందు నిలిపిన సవాల్ను ఎదుర్కొంటున్న తీరు చూసి నిజంగా దుర్గే అనిపించింది. ఆమె జవహర్‌నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. వాళ్లమ్మ గణేశ్, ప్రమీలకు నాలుగో సంతానం. అంతకుముందు జన్మించినవారంతా కూడా అనారోగ్యం ఇతర పరిస్థితుల వల్ల చనిపోగా దుర్గ మాత్రమే ఆ దీనదంపతులకు ప్రియమైన కూతురుగా ఉంది. అశోక నగర్ చౌరస్తాలోని ఫుట్ పాత్పై ప్రమీల పూలు అమ్ముతుండగా సాయంత్రం పాఠశాల అయిపోగానే.. పుస్తకాల సంచితో దుర్గ నేరుగా అక్కడికే వస్తుంది.
ఈ లోగా తల్లి వెళ్లి చిన్నాచితక పనులు చేసుకుంటుంది. అప్పటి వరకు దుర్గనే ఓ పక్క చదువుకుంటూ.. మరోపక్క పూలను అమ్ముతూ చిన్నవయసులోనే చేదోడు వాదోడుగా ఉంటుంది. కానీ, మనసులో ఓ ఆందోళన ఇన్ని ఇబ్బందుల మధ్య దుర్గకు పుస్తకాలతో సహవాసం ఎన్నాళ్లు నిలిచిఉంటుందోనని.. ఆ ఆందోళన వెంటే మరో ఆశ.. ఆ పుస్తకం ఎప్పటికీ దుర్గనే అంటిపెట్టుకొని ఆమెకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని.. ఏదేమైనా కళ్లకు కనిపించిన ఈ దుర్గకు, కళ్లకు కనిపించకుండా ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్న దుర్గలకు నిజంగా ప్రభుత్వం నుంచైనా, తమకు చాలినంత సంపద కంటే మిగులు సంపద ఉన్న వ్యక్తుల నుంచైనా సాయం అందితే ఈ దుర్గలు నిజంగా అవుతారు సరస్వతీ పుత్రికలు.
ఈ చిట్టి దుర్గ సరస్వతిగా మారుతుందా..!
Published Fri, Dec 4 2015 9:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement