
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
విరసం నేత వరవరరావు
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్‌ఎస్ రావు స్మారక సదస్సు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించారు. ‘వ్యవసాయ రంగంలో మార్పులు’ అనే అంశంపై జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో విద్యుత్ కోతలు మరింత నష్టాన్ని మిగిల్చాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని దుయ్యబట్టారు.
గ్రామాల్లో భూమి ఉన్న రైతులు సైత ం కూలీలుగా మారే పరిస్థితి నెలకొందన్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే చేతి వృత్తులు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇసుక, గ్రానైట్, కలప, ఫైనాన్స్, సారా వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయన్నారు. గ్రామాల్లోని వనరులపై వారికే హక్కులేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహా రెడ్డి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, హెచ్‌సీయూ అధ్యాపకులు జి.విజయ్, ఆర్.విజయ్, భారతి, మురళి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.