ఆకాశం అంచులు తాకాం..
* ప్రభుత్వ పాఠశాల టెన్త్ టాపర్స్‌కు అరుదైన అవకాశం
* వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విమానంలో విహారం
ఎల్‌బీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి టాపర్స్‌గా నిలచిన విద్యార్థులకు వందేమాతరం పౌండేషన్ నిర్వాహకులు అరుదైన అవకాశం కల్పించారు. వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి సహకారంతో సోమవారం విద్యార్థులకు ఉచితంగా బుల్లి విమానాలలో గగనంలో విహరించే అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థులు గాల్లో చక్కర్లు కొట్టి సందడి చేశారు.
తెలంగాణ జిల్లాల్లో టాపర్స్‌గా నిలచిన విద్యార్థుల్లో 111 మందికి ఈ అవకాశం దక్కింది. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ ఐజీ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లోచదివే విద్యార్థులంటే చిన్నచూపు తగదని పేర్కొన్నారు. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి డెరైక్టర్, కెప్టెన్ మమత, ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, మర్రి రవీందర్‌రెడ్డి, వసంత్ వోరా, బాల్‌రాజ్‌గౌడ్, ప్రోగ్రాం ఇన్‌చార్జి జగన్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పలేని ఆనందం కలిగింది
విమాన విహారం ఎంతో ఉల్లాసంగా ఉంది. ఆకాశంలో చక్కర్లు కొడుతుం టే చెప్పలేని ఆనందం కలిగింది. బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా.
- శివాని, జెడ్‌పీహెచ్‌ఎస్ ఆలేరు, నల్లగొండ జిల్లా
ఊహించలేని ఉత్కంఠ
బుల్లి విమానంలో ఆకాశంలో తిరుగుతుంటే చేస్తుంటే ఊహించలేనంత ఉత్కంఠ, ఉల్లాసం నెలకొంది. ఇటువంటి అవకాశం వస్తుందని ఎపుడు ఊహించలేదు.
- మౌనిక, జెడ్‌పీహెచ్‌ఎస్ శేరిగూడ, రంగారెడ్డి జిల్లా
అరుదైన అవకాశం
పేద కుటుంబానికి చెందిన నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు. విమానంలో విహరిస్తుం టే చెప్పలేనంత ఆనందం కలిగింది. బాగా చదువుకుని ఇంజనీరును అవుతాను.
- రేవతి, జెడ్‌పీహెచ్‌ఎస్ నాగ్‌పల్లి, ఖమ్మం జిల్లా
ఇది మా అదృష్టం
మాలాంటి పేద విద్యార్థులు విమానంలో తిరగడమంటే అది అదృష్టమే.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదివి ఏరొనాటికల్ ఇంజనీర్ అవుతా.
- ప్రవీణ్‌రాజ్, జెడ్‌పీహెచ్‌ఎస్ పస్రా,వరంగల్ జిల్లా
ఎంతో సంతోషంగా ఉంది
పదవ తరగతి పరీక్షలో మాకు ఎక్కువ మార్కులు రావడమే గొప్ప అనుకుంటే ఈ విమానయానం అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఐఏఎస్ లేదా పైలట్ కావాలని అనుకుంటున్నాను..
- జి.సురక్షారెడ్డి, జెడ్‌పీహెచ్‌ఎస్ లక్షర్‌బజారు, హన్మకొండ