ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదు
డీఐజీ అకున్ సబర్వాల్
♦ ప్రభుత్వ పాఠశాలల టెన్త్ టాపర్స్ గగన విహారం
♦ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువేమీ కాదని, తాను కూడా పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి విద్యార్థుల విమాన విహారాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి టాపర్స్‌గా నిలచిన విద్యార్థులకు ఈ అరుదైన అవకాశం కల్పించారు. విద్యార్థులు బుల్లి విమానాల్లో చక్కర్లు కొట్టి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఆరుగురు చొప్పున 60 మంది ‘టాపర్స్’ను ఎంపిక చేశారు. అలాగే క్రీడలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలలో ప్రతిభ చూపిన మరో 50 మంది విద్యార్థులను ఎంపికచేసి గగన విహారం అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి నిర్వాహకురాలు కెప్టెన్ మమత, వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి, కో-ఆర్డినేటర్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థులు మాట్లాడుతూ.. వందేమాతరం ఫౌండేషన్ క్యాంపుల వల్ల తమకు ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు రావడం గొప్ప విషయమని విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు.