DIG akun Sabharwal
-
జీపీఎస్ ఏర్పాటుతో మరింత భద్రత
నల్లగొండ క్రైం : జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) వ్యవస్థ ఏర్పాటుతో భద్రతను కట్టుదిట్టం చేయవచ్చని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏఆర్ భవనానికి భూమి పూజ నిర్వహించి క్లూస్ టీమ్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్బీ, పాస్‌పోర్టు, ఎస్.బి, ఆయుధగారం, ఏ.ఆర్. మోటర్ వెహికిల్, డాగ్‌స్కాడ్, పోలీసు ఆస్పత్రి, వెల్ఫేర్ స్టోర్, క్లూస్ టీమ్ విభాగాల్లోని రికార్డులను పరి శీలించారు. అంతకుముందు పోలీసు సిబ్బందితో గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు వాహనాలకు ఏర్పాటు చేసిన రాపిడ్ కాప్ సాప్ట్వేర్ మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసిన జీపీఎస్ పనిచేసే విధానాన్ని, ఫైన్ సాఫ్ట్వేర్ ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఏదైనా రోడ్డు ప్రమాదం, ఘర్షణలు, ధర్నాలు జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంలో ఉన్న పోలీసు వాహనాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించి ఘటన స్థలానికి చేరే విధానం, జరిగిన సంఘటనలను యాప్ ద్వారా ఫొటో తీసి అనుసంధానం చేయడం, ఆందోళన చేయడానికి ఎంత మంది పోలీసులు అవసరమవుతారో వెంటనే తెలిసి పోతుందని వివరించారు. ఫైన్ సాప్ట్వేర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేర సంఘటనలో సంబంధమున్నా గుర్తిస్తామని అన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలను సాప్ట్‌వేర్‌తో గుర్తించి నేరస్తులను అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కంటే మాబ్ కంట్రోల్ డిల్ ఆపరేషన్ చాలా బాగా చేశారని ప్రశంసించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ జిల్లా ప్రజలకు భద్రతను, భరోసాను కల్పించేందుకు జిల్లా పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జీపీఎస్, ఫైన్, 100 నంబర్ అనుసంధానం చేసి జిల్లా కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా వెంటనే ఏమి జరిగిందో తెలిసి పోతుందని పేర్కొన్నారు. ప్రమాద రహిత జిల్లాగా ఉండాలి రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా నల్లగొండ ఉండాలని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం ఎన్జీ కాలేజీలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, జేసీ నారాయణరెడ్డితో కలిసి 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు పిల్లలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ట్రాన్స్‌పోర్టు రవాణా అధికారులు ఉద్యోగులు కలిసి ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజాగ్రత్త వలన 80శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభిమానం కోసం మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణం పోతే ఆ కుటుంబం వీధిన పడుతుందని, అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతిపౌరుడి బాధ్యత అని జాగ్రత్తతోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రవాణా, పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, సుధాకర్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘టఫ్’పై కక్ష సాధింపు చర్యలు కాదు
- చట్టపరమైన చర్యలు మాత్రమే: డీఐజీ అకున్ సబర్వాల్ - తెలంగాణ, ఏపీల్లో మళ్లీ పుంజుకునేందుకు జనశక్తి యత్నాలు - మూడు సాయుధ దళాల ఏర్పాటుకు వ్యూహం - టఫ్, అరుణోదయ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు - అందుకే టఫ్ కార్యాలయాన్ని సీజ్ చేశాం సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ విధానాలను టఫ్ వ్యతిరేకిస్తుండడం వల్లే ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలను డీఐజీ అకున్ సబర్వాల్ ఖండించారు. చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. కామారెడ్డి ఎస్పీ శ్వేతతో కలసి హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆదివారం డీజీపీ కార్యాలయంలో మాట్లాడారు. టఫ్ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో ఎటువంటి ఆయుధాలు లభించలేదని చెప్పారు. అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న విప్లవ సాహిత్యం చట్ట వ్యతిరేకమా కాదా అన్న అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా గుజరాత్ జైల్లో నిర్బంధంలో ఉన్న కూర అమర్‌కు జనశక్తి కార్యకలాపాలతో సంబంధమేంటని ప్రశ్నించగా.. భౌతికంగా కాకపోరుునా దాదాపు సంబంధం ఉందన్నారు. ఈ అంశాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కూర రాజన్న, అమర్, విమలక్కలపై కేసుల నమోదుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జనశక్తిపై నిషేధం విధించే అంశంపై పరిశీలన జరుపుతామన్నారు. జనశక్తి డెన్‌గా ‘టఫ్’కార్యాలయం తెలంగాణ, ఏపీల్లో సీపీఐ (ఎంఎల్) జనశక్తి మిలి టెంట్ చర్యలతో మళ్లీ పుంజుకునేందుకు యత్నిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత అన్నారు. రెండు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మూడు సాయుధ దళాలను ఏర్పాటు చేయాలని జనశక్తి అగ్ర నాయకత్వం నిర్ణరుుంచిందని విచారణలో తెలిసిందన్నారు. అంతకుముందు కామారెడ్డిలోని తన కార్యాలయంలో శ్వేత మాట్లాడారు. జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, కేంద్ర కమిటీ సభ్యులు కూర అమర్, విమలక్క నాయకత్వంలో నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, కర్నూలు జిల్లాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 2న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు పమేన భీంభరత్‌ను అరెస్టు చేసి 20 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై హత్య, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, మహిళను అగౌరవపరచడం వంటి కేసులు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న తెలంగాణ యునెటైడ్ ఫోరం(టఫ్) కార్యాలయాన్ని జనశక్తి డెన్ గా వాడుకుంటోందని పోలీసుల విచారణలో భీంభరత్ వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. ఆయుధాల సరఫరా, జనశక్తి బలోపేతం కోసం టఫ్ కార్యాలయాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. టఫ్, అరుణోదయ సాంస్కృతి సమాఖ్య సంస్థల ముసుగులో రియల్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. కొంత కాలం స్తబ్దుగా ఉన్న జనశక్తి మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పరారీలో విమలక్క, అమర్, రాజన్న: ఎస్పీ మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో గతేడాది నమోదైన కేసుకు సంబంధించి విమలక్క, కూర రాజన్న, అమర్, దొమ్మని నర్సింహ అలియాస్ ఆనంద్, కనకం మల్లేశ్, వీరస్వామి, నారాయణదాస్, పోపుల్ల సురేశ్, అబ్బన్న, మూర్తి శ్రీనివాస్‌రెడ్డిలు కూడా నిందితులని ఎస్పీ తెలిపారు. వారు పరారీలో ఉన్నారని చెప్పారు. -
పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ
నాంపల్లి : స్థానిక పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్ సభర్వాల్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ పనితీరును, రికార్డులను, భవనాన్ని పరిశీలించారు. ముందుగా డీఐజీకి సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. సిబ్బంది పనితీరు, వారి సామగ్రి, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పనితీరు, పరిసరాలను ఉంచినందుకు స్థానిక సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ ప్రకాశ్‌రావును ప్రత్యేకంగా అభినందించారు. 23 సంవత్స రాల క్రితం నిర్మించిన స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ శిథిలావస్థల్లో ఉండి సిబ్బంది నివాసానికి ఇబ్బందిగా ఉన్నందున్న నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ చంద్రమోహన్, ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీఐలు గిరిబాబు, బాలగంగిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శివరాంరెడ్డి, ఎస్ఐలు ఖలీల్‌ఖాన్, సర్ధార్, శంకర్‌రెడ్డి, శేఖర్, రాఘవేందర్, సతీష్, కాంత్రికుమార్, ప్రకాశ్‌రావు, నాగభూషన్‌రావు, రాము , ఏఎస్ఐ దివంతరావు, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రాజు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. సీఐ కార్యాలయంపై ఆరా... నాంపల్లి సర్కిల్ కార్యాలయం స్థానికంగా లేకుండా పక్క మండలం మర్రిగూడలో ఎందుకు ఉందని డీఐజీ అకున్ సభర్వాల్ ఆరా తీశారు. కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా క్వాటర్స్, కార్యాలయ భవనం లేక పోవడంతో మర్రిగూడలోనే కొనసాగుతుందని స్థానిక సిబ్బంది తెలిపారు. దాంతో ఈ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. -
కారు దిగి కాలినడకన..
అరకిలోమీటరు దూరం నడిచిన డీఐజీ రైలు గేటు పడడంతో ఎస్పీ కార్యాలయం దారిలో వాకింగ్.. సాక్షి, కామారెడ్డి : డీఐజీ అకున్ సబర్వాల్.. కామారెడ్డిలో సుమారు అరకిలోమీటరు దూరం వాకింగ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించడానికి మంగళవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన రాక నేపథ్యంలో పట్టణ శివారు నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పీ కార్యాలయం దారిలో రైలు వస్తుండడంతో గేట్‌మన్ గేటు వేశారు. గేటు తీయడానికి పది నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డీఐజీ కారు దిగి నడవడం ప్రారంభించారు. పట్టాలు దాటిన తర్వాత అవతలి వైపు ఉన్న ఎస్సై ఒకరు తన బుల్లెట్ వాహనాన్ని ఇవ్వబోగా వారించి కాలినడకనే ముందుకు సాగారు. సుమారు అర కిలోమీటరు నడిచిన తర్వాత రైల్వేగేటు ఎత్తడంతో డీఐజీ కారు వచ్చింది. దానిలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. -
కేసుల విచారణ లోపభూయిష్టం
♦ డీజీపీకి నివేదిక అందజేస్తా ♦ సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌లో పలు ఠాణాల విలీనం ♦ కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్‌పై యోచన ♦ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీలకు ఆదేశాలు ♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు: సీరియస్ కేసుల్లో పోలీసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. వివిధ కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడారు. తాండూరులో సీరియస్ కేసుల విచారణ సరిగా జరగంలేదని, లోపాలు చాలాఉన్నాయని అన్నారు. ఆయా కేసులకు సంబంధించి రికార్డుల నిర్వహణ సరిగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నుంచి సీసీఎస్ డీఎస్పీ, ఇద్దరు సీఐలతో కేసుల రికార్డుల నిర్వహణను పరిశీలించగా లోపాలు ఉన్నట్టు తేలిందన్నారు. ఆయా అంశాలపై డీజీపీకి నివేదిక అందజేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు నిలబడేలా విచారణ ప్రక్రియతోపాటు రికార్డుల నిర్వహణను పోలీసులు మెరుగు పర్చుకోవాల్సి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖలో కూడా పునర్విభజన ప్రక్రియ మొదలైందనన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ పోలీసుస్టేషన్లు సైబరాబాద్ పశ్చిమంలో కలువనున్నట్టు తెలిపారు. సైబరాబాద్ తూర్పు, పశ్చిమలో 15 ఠాణాల్లో మార్పు జరుగనుందని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని, తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వం 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నదని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ మార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు డీఐజీ స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లకు ఆదివారం వారాంతపు సెలవు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా ఎస్పీ బీ.నవీన్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త ఎస్ఐలు ఠాణాలకు పరిమితం కావద్దు.. కొత్తగా నియామకమైన ఎస్ఐలు ఠాణాలకే పరిమితం కావొద్దని అకున్ సబర్వాల్ సూచించారు. ఉదయం 10గంటలకు తాండూరుకు చేరుకున్న డీఐజీ నేరుగా పట్టణంలోని మినీ స్టేడియానికి వెళ్లారు. అక్కడ తాండూరు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు,ఎస్ఐలు, కానిస్టేబుళ్ల పరేడ్‌ను పరిశీలించారు. కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ కానిస్టేబుళ్ల బదిలీలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. పరేడ్‌లో యూనిఫాంలు బాగున్న కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వాలని ఎస్పీ నవీన్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి, తాండూరు రూరల్, అర్బన్ సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్యలతో పలు అంశాలపై డీఐజీ సమీక్షించారు. తర్వాత డీఏసీ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవీన్‌కుమార్, ఏఎస్పీ చందనదీప్తి, సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణకారెడ్డి, నాగార్జున, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీఐజీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదు
డీఐజీ అకున్ సబర్వాల్ ♦ ప్రభుత్వ పాఠశాలల టెన్త్ టాపర్స్ గగన విహారం ♦ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువేమీ కాదని, తాను కూడా పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి విద్యార్థుల విమాన విహారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి టాపర్స్‌గా నిలచిన విద్యార్థులకు ఈ అరుదైన అవకాశం కల్పించారు. విద్యార్థులు బుల్లి విమానాల్లో చక్కర్లు కొట్టి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఆరుగురు చొప్పున 60 మంది ‘టాపర్స్’ను ఎంపిక చేశారు. అలాగే క్రీడలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలలో ప్రతిభ చూపిన మరో 50 మంది విద్యార్థులను ఎంపికచేసి గగన విహారం అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి నిర్వాహకురాలు కెప్టెన్ మమత, వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేందర్, వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి, కో-ఆర్డినేటర్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థులు మాట్లాడుతూ.. వందేమాతరం ఫౌండేషన్ క్యాంపుల వల్ల తమకు ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు రావడం గొప్ప విషయమని విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు.