‘టఫ్’పై కక్ష సాధింపు చర్యలు కాదు
- చట్టపరమైన చర్యలు మాత్రమే: డీఐజీ అకున్ సబర్వాల్
- తెలంగాణ, ఏపీల్లో మళ్లీ పుంజుకునేందుకు జనశక్తి యత్నాలు
- మూడు సాయుధ దళాల ఏర్పాటుకు వ్యూహం
- టఫ్, అరుణోదయ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు
- అందుకే టఫ్ కార్యాలయాన్ని సీజ్ చేశాం
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ విధానాలను టఫ్ వ్యతిరేకిస్తుండడం వల్లే ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలను డీఐజీ అకున్ సబర్వాల్ ఖండించారు. చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. కామారెడ్డి ఎస్పీ శ్వేతతో కలసి హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆదివారం డీజీపీ కార్యాలయంలో మాట్లాడారు. టఫ్ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో ఎటువంటి ఆయుధాలు లభించలేదని చెప్పారు. అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న విప్లవ సాహిత్యం చట్ట వ్యతిరేకమా కాదా అన్న అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా గుజరాత్ జైల్లో నిర్బంధంలో ఉన్న కూర అమర్‌కు జనశక్తి కార్యకలాపాలతో సంబంధమేంటని ప్రశ్నించగా.. భౌతికంగా కాకపోరుునా దాదాపు సంబంధం ఉందన్నారు. ఈ అంశాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కూర రాజన్న, అమర్, విమలక్కలపై కేసుల నమోదుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జనశక్తిపై నిషేధం విధించే అంశంపై పరిశీలన జరుపుతామన్నారు.
జనశక్తి డెన్‌గా ‘టఫ్’కార్యాలయం
తెలంగాణ, ఏపీల్లో సీపీఐ (ఎంఎల్) జనశక్తి మిలి టెంట్ చర్యలతో మళ్లీ పుంజుకునేందుకు యత్నిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత అన్నారు. రెండు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మూడు సాయుధ దళాలను ఏర్పాటు చేయాలని జనశక్తి అగ్ర నాయకత్వం నిర్ణరుుంచిందని విచారణలో తెలిసిందన్నారు. అంతకుముందు కామారెడ్డిలోని తన కార్యాలయంలో శ్వేత మాట్లాడారు. జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, కేంద్ర కమిటీ సభ్యులు కూర అమర్, విమలక్క నాయకత్వంలో నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, కర్నూలు జిల్లాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు.
ఈ నెల 2న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు పమేన భీంభరత్‌ను అరెస్టు చేసి 20 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై హత్య, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, మహిళను అగౌరవపరచడం వంటి కేసులు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న తెలంగాణ యునెటైడ్ ఫోరం(టఫ్) కార్యాలయాన్ని జనశక్తి డెన్ గా వాడుకుంటోందని పోలీసుల విచారణలో భీంభరత్ వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. ఆయుధాల సరఫరా, జనశక్తి బలోపేతం కోసం టఫ్ కార్యాలయాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. టఫ్, అరుణోదయ సాంస్కృతి సమాఖ్య సంస్థల ముసుగులో రియల్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. కొంత కాలం స్తబ్దుగా ఉన్న జనశక్తి మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
పరారీలో విమలక్క, అమర్, రాజన్న: ఎస్పీ
మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో గతేడాది నమోదైన కేసుకు సంబంధించి విమలక్క, కూర రాజన్న, అమర్, దొమ్మని నర్సింహ అలియాస్ ఆనంద్, కనకం మల్లేశ్, వీరస్వామి, నారాయణదాస్, పోపుల్ల సురేశ్, అబ్బన్న, మూర్తి శ్రీనివాస్‌రెడ్డిలు కూడా నిందితులని ఎస్పీ తెలిపారు. వారు పరారీలో ఉన్నారని చెప్పారు.