janashakti
-
ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న
సాక్షి, కామారెడ్డి: ప్రజాయుద్ధంతోనే సమాజానికి రక్షణ ఉంటుందని సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న అన్నారు. భూస్వాములను, దొరలను ప్రభుత్వాలు, పోలీసులు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని, తాను పారిపోయినట్లు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సాగర్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కానీ ఆ వ్యక్తిని కూడా తమతో కలిపి కేస్ చేయడం సరికాదన్నారు. బీడీ కంపెనీలు రక్షణ కోసం ఫండ్ ఇవ్వడం ఆనవాయితీ అని, కానీ కావాలనే డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని కూర రాజన్న పెట్టారు. పెట్టిన కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న బెయిల్ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న!
సాక్షి, సిరిసిల్ల/బోధన్/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న (80) అలియాస్ కేఆర్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. వయోభారంతో రాజన్న అనారోగ్యంతో ఉన్నారని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఏనుగు ప్రభాకర్‌రావు అలియాస్ వేణుగోపాల్‌రావు హత్యకేసులో కూర రాజన్న నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన రాజన్న, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ.. మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్నపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ జనశక్తి సాయుధ దళాలను నిర్మించేందుకు రాజన్న ఆయుధాలు సమకూర్చుకుంటున్నట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెడతారని భావిస్తున్నా... రాజన్న అరెస్ట్‌పై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా... జిల్లాలోని వేములవాడకు చెందిన కూర రాజన్న నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో విచారించాలి.. పోలీసులు అరెస్టుచేసిన సీపీఐఎం ఎల్ జనశక్తి నేత కూర రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విచారించాలని మానవహక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇతరుల సహాయం లేకుండా నడవ లేని, శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్నాడని వైద్యుల పర్యవేక్షణలో, రాజన్న ఏర్పాటు చేసుకున్న న్యాయవాది సమక్షంలో విచారించాలని సంస్థ అధ్యక్షులు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. -
‘టఫ్’పై కక్ష సాధింపు చర్యలు కాదు
- చట్టపరమైన చర్యలు మాత్రమే: డీఐజీ అకున్ సబర్వాల్ - తెలంగాణ, ఏపీల్లో మళ్లీ పుంజుకునేందుకు జనశక్తి యత్నాలు - మూడు సాయుధ దళాల ఏర్పాటుకు వ్యూహం - టఫ్, అరుణోదయ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు - అందుకే టఫ్ కార్యాలయాన్ని సీజ్ చేశాం సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ విధానాలను టఫ్ వ్యతిరేకిస్తుండడం వల్లే ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలను డీఐజీ అకున్ సబర్వాల్ ఖండించారు. చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. కామారెడ్డి ఎస్పీ శ్వేతతో కలసి హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆదివారం డీజీపీ కార్యాలయంలో మాట్లాడారు. టఫ్ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో ఎటువంటి ఆయుధాలు లభించలేదని చెప్పారు. అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న విప్లవ సాహిత్యం చట్ట వ్యతిరేకమా కాదా అన్న అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా గుజరాత్ జైల్లో నిర్బంధంలో ఉన్న కూర అమర్‌కు జనశక్తి కార్యకలాపాలతో సంబంధమేంటని ప్రశ్నించగా.. భౌతికంగా కాకపోరుునా దాదాపు సంబంధం ఉందన్నారు. ఈ అంశాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కూర రాజన్న, అమర్, విమలక్కలపై కేసుల నమోదుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జనశక్తిపై నిషేధం విధించే అంశంపై పరిశీలన జరుపుతామన్నారు. జనశక్తి డెన్‌గా ‘టఫ్’కార్యాలయం తెలంగాణ, ఏపీల్లో సీపీఐ (ఎంఎల్) జనశక్తి మిలి టెంట్ చర్యలతో మళ్లీ పుంజుకునేందుకు యత్నిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత అన్నారు. రెండు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మూడు సాయుధ దళాలను ఏర్పాటు చేయాలని జనశక్తి అగ్ర నాయకత్వం నిర్ణరుుంచిందని విచారణలో తెలిసిందన్నారు. అంతకుముందు కామారెడ్డిలోని తన కార్యాలయంలో శ్వేత మాట్లాడారు. జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, కేంద్ర కమిటీ సభ్యులు కూర అమర్, విమలక్క నాయకత్వంలో నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, కర్నూలు జిల్లాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 2న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు పమేన భీంభరత్‌ను అరెస్టు చేసి 20 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై హత్య, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, మహిళను అగౌరవపరచడం వంటి కేసులు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న తెలంగాణ యునెటైడ్ ఫోరం(టఫ్) కార్యాలయాన్ని జనశక్తి డెన్ గా వాడుకుంటోందని పోలీసుల విచారణలో భీంభరత్ వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. ఆయుధాల సరఫరా, జనశక్తి బలోపేతం కోసం టఫ్ కార్యాలయాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. టఫ్, అరుణోదయ సాంస్కృతి సమాఖ్య సంస్థల ముసుగులో రియల్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. కొంత కాలం స్తబ్దుగా ఉన్న జనశక్తి మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పరారీలో విమలక్క, అమర్, రాజన్న: ఎస్పీ మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో గతేడాది నమోదైన కేసుకు సంబంధించి విమలక్క, కూర రాజన్న, అమర్, దొమ్మని నర్సింహ అలియాస్ ఆనంద్, కనకం మల్లేశ్, వీరస్వామి, నారాయణదాస్, పోపుల్ల సురేశ్, అబ్బన్న, మూర్తి శ్రీనివాస్‌రెడ్డిలు కూడా నిందితులని ఎస్పీ తెలిపారు. వారు పరారీలో ఉన్నారని చెప్పారు. -
జిల్లాలో జన శక్తి కదలికలు
రాష్ట్ర కమిటీ ఏర్పాటే లక్ష్యం ఆయుధాలు, ఆర్థిక వనరులపై వ్యూహ రచన ఆదిలోనే అడ్డుకున్న పోలీసులు కర్నూలు : జిల్లాలో జనశక్తి కదలికలకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన జనశక్తి కార్యకలాపాలను జిల్లా అంతటా విస్తృతం చేసేందుకు కూర రాజన్న నాయకత్వంలో చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాలో జనశక్తి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాలని, ఇందుకోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సంబంధించి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ముందస్తుగా దృష్టి సారించారు. నగరంలోని ఒక వీఐపీని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై సదరు వీఐపీ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో మరి కొంతమంది కాంట్రాక్టర్లను కూడా ఆర్థిక వనరుల కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో రెండు నెలలుగా జనశక్తి కార్యకలాపాలపై నిఘాను ఏర్పాటు చేసి కూర రాజన్నతో పాటు 10 మంది జనశక్తి సభ్యులను అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. బొల్లవరం మాజీ సర్పంచ్ రమణారెడ్డి అల్లుడు మోహన్‌రెడ్డి కల్లూరులోని బాబా బృందావన్ నగర్లో నివాసం వుంటున్నాడు. కూర రాజన్నతో పాటు మరో మాజీ సర్పంచు వడ్డె పోతన, పర్ల గ్రామానికి చెందిన సుంకన్న, పెద్దటేకూరుకు చెందిన మండ్ల వసంతు, ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేటకు చెందిన చాకలి శ్రీను, ఆదోని పట్టణానికి చెందిన నెంబి నరసింహయ్య, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అందె బాలాజీ, నెల్లూరు జిల్లాకు చెందిన పండ్ల పెంచలయ్య, రాజమండ్రికి చెందిన మోతె వెంకట్రావు, కృష్ణా జిల్లాకు చెందిన సింగోట నాగేంద్రరావు, తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన వీరాంజనేయులు తదితరులు సమావేశమయ్యారు. పక్కా సమాచారంతో సోమవారం ఆర్ధరాత్రి దాటిన తరువాత ఆర్ఎస్ఐ ప్రతాప్ నేతృత్వంలో సీఐలు ప్రవీణ్‌కుమార్, నాగరాజుయాదవ్, స్పెషల్ పార్టీ పోలీసులు మూక్ముడిగా దాడి చేసి పట్టుకున్నారు. భారీగా ట్రీట్మెంట్ ఇచ్చి మంగళవారం సాయంత్రం మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా కొందరు జనశక్తి సభ్యులు నడవలేని స్థితిలో పోలీసుల సహాయంతో మీడియా ముందు హాజరయ్యారు. రెండు దశాబ్దాల అనంతరం 1990 కంటే ముందు జిల్లాలో అక్కడక్కడా జనశక్తి కార్యకలాపాలు కొనసాగుతు వచ్చాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు జనశక్తి, పీపుల్స్‌వార్ కార్యకాలపాలపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లాను ఆనుకొని వున్న నల్లమలలో వీరి కదలికలు తగ్గుతూ వచ్చాయి. రాష్ట్రం విడిపోవడంతో జిల్లాలో మళ్లీ జనశక్తిని బలోపేతం చేసేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణలో వీరు పట్టుబడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల మేరకు ఏడు నెలల క్రితం బనగానపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డిని కొలిమిగుండ్ల సమీపంలో ఆయుధాలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. బొల్లవరం మాజీ సర్పంచు వడ్డె పోతన, పర్ల బోయ సుంకన్న పాత్ర ఇందులో ప్రధానంగా పోలీస్ విచారణలో బయట పడింది. అలాగే కర్నూలు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను బెదిరించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.