కేసుల విచారణ లోపభూయిష్టం
♦ డీజీపీకి నివేదిక అందజేస్తా
♦ సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌లో పలు ఠాణాల విలీనం
♦ కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్‌పై యోచన
♦ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీలకు ఆదేశాలు
♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్
తాండూరు: సీరియస్ కేసుల్లో పోలీసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. వివిధ కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడారు. తాండూరులో సీరియస్ కేసుల విచారణ సరిగా జరగంలేదని, లోపాలు చాలాఉన్నాయని అన్నారు. ఆయా కేసులకు సంబంధించి రికార్డుల నిర్వహణ సరిగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నుంచి సీసీఎస్ డీఎస్పీ, ఇద్దరు సీఐలతో కేసుల రికార్డుల నిర్వహణను పరిశీలించగా లోపాలు ఉన్నట్టు తేలిందన్నారు. ఆయా అంశాలపై డీజీపీకి నివేదిక అందజేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
కోర్టుల్లో కేసులు నిలబడేలా విచారణ ప్రక్రియతోపాటు రికార్డుల నిర్వహణను పోలీసులు మెరుగు పర్చుకోవాల్సి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖలో కూడా పునర్విభజన ప్రక్రియ మొదలైందనన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్ పోలీసుస్టేషన్లు సైబరాబాద్ పశ్చిమంలో కలువనున్నట్టు తెలిపారు. సైబరాబాద్ తూర్పు, పశ్చిమలో 15 ఠాణాల్లో మార్పు జరుగనుందని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని, తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
ప్రభుత్వం 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నదని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ మార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు డీఐజీ స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లకు ఆదివారం వారాంతపు సెలవు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా ఎస్పీ బీ.నవీన్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
కొత్త ఎస్‌ఐలు ఠాణాలకు పరిమితం కావద్దు..
కొత్తగా నియామకమైన ఎస్‌ఐలు ఠాణాలకే పరిమితం కావొద్దని అకున్ సబర్వాల్ సూచించారు. ఉదయం 10గంటలకు తాండూరుకు చేరుకున్న డీఐజీ నేరుగా పట్టణంలోని మినీ స్టేడియానికి వెళ్లారు. అక్కడ తాండూరు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు,ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల పరేడ్‌ను పరిశీలించారు. కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ కానిస్టేబుళ్ల బదిలీలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. పరేడ్‌లో యూనిఫాంలు బాగున్న కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వాలని ఎస్పీ నవీన్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి, తాండూరు రూరల్, అర్బన్ సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్యలతో పలు అంశాలపై డీఐజీ సమీక్షించారు. తర్వాత డీఏసీ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవీన్‌కుమార్, ఏఎస్పీ చందనదీప్తి, సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్య, ఎస్‌ఐలు రేణకారెడ్డి, నాగార్జున, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీఐజీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.