జీపీఎస్‌ ఏర్పాటుతో మరింత భద్రత | More security for the establishment of GPS | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌ ఏర్పాటుతో మరింత భద్రత

Published Wed, Jan 18 2017 4:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

More security for the establishment of GPS

నల్లగొండ క్రైం : జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌) వ్యవస్థ ఏర్పాటుతో భద్రతను కట్టుదిట్టం చేయవచ్చని డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏఆర్‌ భవనానికి భూమి పూజ నిర్వహించి క్లూస్‌ టీమ్‌ కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్‌బీ, పాస్‌పోర్టు, ఎస్‌.బి, ఆయుధగారం, ఏ.ఆర్‌. మోటర్‌ వెహికిల్, డాగ్‌స్కాడ్, పోలీసు ఆస్పత్రి, వెల్ఫేర్‌ స్టోర్, క్లూస్‌ టీమ్‌ విభాగాల్లోని రికార్డులను పరి శీలించారు. అంతకుముందు పోలీసు సిబ్బందితో గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు వాహనాలకు ఏర్పాటు చేసిన రాపిడ్‌ కాప్‌ సాప్ట్‌వేర్‌ మొబైల్‌ యాప్‌తో అనుసంధానం చేసిన జీపీఎస్‌ పనిచేసే విధానాన్ని, ఫైన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని ఎస్పీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. ఏదైనా రోడ్డు ప్రమాదం, ఘర్షణలు, ధర్నాలు జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంలో ఉన్న పోలీసు వాహనాన్ని జీపీఎస్‌ ద్వారా గుర్తించి ఘటన స్థలానికి చేరే విధానం, జరిగిన సంఘటనలను యాప్‌ ద్వారా ఫొటో తీసి అనుసంధానం చేయడం, ఆందోళన చేయడానికి ఎంత మంది పోలీసులు అవసరమవుతారో వెంటనే తెలిసి పోతుందని వివరించారు. ఫైన్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేర సంఘటనలో సంబంధమున్నా గుర్తిస్తామని అన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలను సాప్ట్‌వేర్‌తో గుర్తించి నేరస్తులను అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కంటే మాబ్‌ కంట్రోల్‌ డిల్‌ ఆపరేషన్‌ చాలా బాగా చేశారని ప్రశంసించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ జిల్లా ప్రజలకు భద్రతను, భరోసాను కల్పించేందుకు జిల్లా పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జీపీఎస్, ఫైన్, 100 నంబర్‌ అనుసంధానం చేసి జిల్లా కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించడం ద్వారా వెంటనే ఏమి జరిగిందో తెలిసి పోతుందని పేర్కొన్నారు.

ప్రమాద రహిత జిల్లాగా ఉండాలి
రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా నల్లగొండ ఉండాలని  డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. మంగళవారం ఎన్జీ కాలేజీలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, జేసీ నారాయణరెడ్డితో కలిసి 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు పిల్లలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ట్రాన్స్‌పోర్టు రవాణా అధికారులు ఉద్యోగులు కలిసి ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజాగ్రత్త వలన 80శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభిమానం కోసం మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణం పోతే ఆ కుటుంబం వీధిన పడుతుందని, అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతిపౌరుడి బాధ్యత అని జాగ్రత్తతోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రవాణా, పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, సుధాకర్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement