ఇంగ్లిష్ బాటలో సర్కారు బడి!
- ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుకు సర్కారు చర్యలు
- ఎల్‌కేజీ, యూకేజీ ఏర్పాటుకు ‘వయసు’ నిబంధన అడ్డు
- ఈ ఏడాది ఒకటో తరగతిలో మాత్రమే.. ఏటా ఒక్కో తరగతి పెంపు
- త్వరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించేందుకు సర్కారు చర్యలు చేపడుతోంది. ఎల్‌కేజీ(ప్రీపైమరీ) నుంచే ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా.. పిల్లల్ని బడిలో చేర్చుకునే వయసు నిబంధన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ఒకేసారి ఇం గ్లిషు మీడియం ప్రవేశపెట్టకుండా.. ఈ ఏడాది ఒకటో తరగతిలోనే ప్రారంభించనుంది. వచ్చే ఏడాది రెండో తరగతిలో, ఆ తర్వాత మూడో తరగతిలో ఇలా ఏటా పెంచుకుం టూ అమలు చేయనుంది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం బోధన కోసం మూడు దశల్లో తీర్మానం చేసి పంపితేనే ప్రారంభిస్తామన్న విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు చర్యలు చేపట్టారు. ‘సాక్షి’ జిల్లాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం... 3 వేలకు పైగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని డీఈవోలు లెక్కించారు.
తల్లిదండ్రుల్లో నిరాశ: ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం తల్లిదండ్రుల్లో నిరాశ నింపుతోంది. ఇంగ్లిష్ మీడియంను ఎల్‌కేజీ నుంచే (మూడేళ్ల వయసు నుంచే) ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ‘బడి బాట’ సందర్భంగా క్షేత్రస్థాయిలో టీచర్లు అదే హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని బడిబాట కార్యక్రమంలో టీచర్లు హామీలు ఇచ్చారు. ఈ మేరకే వారు, తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు తీర్మానాలు చేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది.
తీర్మానాల మేరకే..: ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే తాము బోధిస్తామని టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు... తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తామని తల్లిదండ్రులు.. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధంగా ఉన్నామని, తగిన వనరులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు తీర్మానం చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని మూడు దశల్లో తీర్మానం చేయాలని, ఆ ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా వస్తేనే... ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తామని నిబంధన విధించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకు పైగా పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్లు, కమిటీలు తీర్మానాలు చేశారు. డీఈవోలు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రతిపాదనలను పాఠశాల విద్యా డెరైక్టర్ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం వచ్చాకే ఆయా పాఠశాలల్లో అధికారికంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైనట్లు లెక్క.
కొన్ని చోట్ల ఇతర తరగతుల్లోనూ..
కొన్ని చోట్ల ఒకటో తరగతిలో కాకుండా ఇతర తరగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల 6వ తరగతిలో, మరికొన్ని చోట్ల 7వ తరగతిలో ఇంగ్లిష్ మీడియం కోసం చర్యలు చేపట్టారు. అయితే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు డెరైక్టరేట్‌కు అందలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. గతంలోనూ విద్యాశాఖకు తెలియకుండా ఇంగ్లిష్ మీడియం బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రారంభించారు. దీంతో టీచర్ల సమస్య తలెత్తింది. ఈసారి ఏం చేస్తారన్నది త్వరలోనే తేలనుంది.
ప్రీప్రైమరీ సిలబస్‌పై దృష్టి
ప్రైవేటు స్కూళ్లలో ప్రీప్రైమరీ విద్య ఉన్నందున ఆ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే ప్రీప్రైమరీలో ఉపాధ్యాయ విద్యా కోర్సు ప్రారంభం, దాని సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 263 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రీప్రైమరీ కోసం విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఏటా ఒక్కో తరగతిలో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఒకేసారి అన్ని తరగతుల్లో కాకుండా ఏటా ఒక్కో తరగతిలో ప్రారంభిస్తూ వెళ్లాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది 2వ తరగతిలో, ఆపై మూడో తరగతిలో.. క్రమంగా ఇంగ్లిష్ మీడి యంను అన్ని తరగతులకు వర్తింపజేయాలని భావిస్తోంది. తల్లిదండ్రులు డిమాం డ్ చేస్తున్న ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు పాఠశాలల తరహాలో మూడేళ్ల వయసులోనే పిల్లలను స్కూల్‌లో చేర్చుకునేలా ఎల్‌కేజీ, యూకేజీ నుంచే కావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ ప్రారంభించాలంటే.. పిల్లలను బడిలో చేర్చుకునే వయసు నిబంధనను మార్పు చేయాలని, అది ఇప్పటికిప్పుడు సాధ్యం కానందునే ఒకటో తరగతి నుంచి ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.