
‘గ్రేటర్’కు కాసుల పంట..
జీహెచ్‌ఎంసీకి భారీగా సమకూరిన ఆదాయం
► ఆస్తి పన్ను కింద శుక్రవారం ఒక్కరోజే రూ.50 కోట్ల రాబడి
► గ్రేటర్ లో వివిధ ప్రభుత్వ సంస్థలకు రూ.100 కోట్ల వసూలు
► కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా సెంటర్లు
► 14వ తేదీ వరకూ పన్ను చెల్లింపుల గడువు పొడిగింపు
► సెలవు దినాల్లోనూ పన్నులు, వినియోగ చార్జీల చెల్లింపునకు అవకాశం
► ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జీహెచ్‌ఎంసీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను, నీటి, విద్యుత్ బిల్లులు తదితర ఫీజులను పాత రూ.500, రూ.1,000 నోట్ల ద్వారా చెల్లించేందుకు వినియోగదారులకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ గడువు ఇవ్వడంతో ‘గ్రేటర్’కు కాసుల పంట పండింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లింపుల కింద శుక్రవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు రూ.48 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తం రూ.50 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. సాధారణ రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలవుతుంది. కానీ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల వరకూ ఆస్తి పన్ను వసూలవ్వడం గమనార్హం.
కాగా, అన్ని రకాల బిల్లులు, పన్నులు వెరసి గ్రేటర్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలకు దాదాపు రూ.100 కోట్ల రాబడి వచ్చింది. పాత నోట్లతో పన్నులు, వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసీ పౌరసేవా కేంద్రాలు(సీఎస్సీలు), మీసేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను మొత్తంతోపాటు పాత బకాయిల చెల్లింపులకూ అవకాశం ఉండటంతో అనేక మంది బకాయిలతో సహా చెల్లించారు. మరికొందరు అడ్వాన్‌సగా రెండు, మూడేళ్ల ఆస్తి పన్ను ముందస్తుగానే కట్టేందుకు ముందుకొచ్చినా.. వాటిని స్వీకరించలేదు. జీహెచ్‌ఎంసీలోని పౌరసేవా కేంద్రాలతోపాటు బిల్ కలెక్టర్లకు.. మీసేవా, ఏపీ ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లించారు.
మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షమంది వివిధ రకాలైన పన్నులు, ఫీజుల్ని చెల్లించినట్టు సమాచారం. భారీ మొత్తంలో బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులతో జీహెచ్‌ఎంసీ అధికారులు సంప్రదింపులు జరపడంతో పలువురు బకాయిలు చెల్లించారు. మొత్తంగా ఆరు వేల మందికి పైగా తమ ఆస్తిపన్ను చెల్లించారు.
శుక్రవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ సంస్థల ఆదాయం
జీహెచ్‌ఎంసీ : రూ.50 కోట్లు
జలమండలి : రూ.15 కోట్లు
విద్యుత్‌శాఖ : రూ.30 కోట్లు
హెచ్‌ఎండీఏ : రూ.4.10 కోట్లు
డిస్కంకు రూ.71 కోట్లు..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు పాత నోట్ల స్వీకరణతో శుక్రవారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు రూ.71 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు సర్కిళ్ల నుంచి రూ.30 కోట్ల బిల్లులు రాగా, జిల్లాల నుంచి రూ.41 కోట్లు వసూలైనట్లు డిస్కం ఆపరేషన్‌స డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు.
14 వరకూ చెల్లింపులు జరపొచ్చు..
తమ పిలుపునకు స్పందించిన ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం మరో 72 గంటలపాటు పాత నోట్లను చెల్లింపులకు అనుమతించడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచు కోవాలని మేయర్ సూచించారు. భవన నిర్మాణ అనుమతులకు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫీజు సమా చారం జనరేట్ అరుున వారు, పాత బకారుులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెల్లింపుల కోసం శుక్రవారం పౌరసేవా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు సోమవారం వరకు కొనసాగుతాయని చెప్పారు.
సెలవు దినాల్లోనూ పనిచేస్తాయ న్నారు. ట్రేడ్ లెసైన్సుల రెన్యువల్, వేకెంట్ ల్యాండ్ టాక్స్ తదితర మైన వాటికి పాతనోట్లతో చెల్లింపులు జరపొచ్చని స్పష్టం చేశారు. సిటీ లెవెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫీజుల కోసం చెల్లించే పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించిన వారు వాటిని ఉపసంహరించుకుని పాతనోట్లతో నగదు చెల్లించవచ్చన్నారు. పాతనోట్లతో చెల్లించే ఈ పన్నులకు, ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
జలమండలికి రికార్డు ఆదాయం..
పాత నోట్ల స్వీకరణతో జలమండలికి శుక్రవారం రికార్డు స్థారుులో ఆదాయం సమకూరింది. క్యాష్ కౌంటర్లు, ఆర్‌టీజీఎస్, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా సుమారు 53 వేల మంది వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లులు చెల్లించారు. దీంతో రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. పాతనోట్ల స్వీకరణ గడువును కేంద్రం పొడిగించడంతో జలమండలికి సుమారు రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు వసూలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జలమండలికి నెలవారీగా నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీ ద్వారా సుమారు రూ.90 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.