గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్
హైదరాబాద్ : గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి మాజీ మంత్రి కృష్ణయాదవ్ శుక్రవారం రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల సమయంలో కృష్ణయాదవ్ రాజీనామా ఆ పార్టీలో గుబులు రేపుతోంది.
కాగా పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో పార్టీలో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరడంతో గ్రేటర్ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గ్రేటర్ అధ్యక్ష పదవి వరించింది. దీంతో అప్పటి నుంచి కృష్ణయాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. చివరకు గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోకపోవడంతో ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.