ప్రతి నియోజకవర్గంలో రెండేసి గురుకులాలు!
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనాభా ప్రాతిపదికన స్కూళ్ల ఏర్పాటు
* అన్ని గురుకులాలకు ఒకే సర్వీసు రూల్స్, విద్యా విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కనీసం రెండేసి సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఎక్కువగా ఉంటే తదనుగుణంగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన ఆయా వర్గాల జనాభా వివరాలను మండలాల వారీగా సరి చూసుకుని, వారి జనాభాకు తగ్గట్లుగా ఇంగ్లిష్ మీడియంలో ఈ పాఠశాలలను ప్రారంభిస్తారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఏర్పాటు చేయబోయే మొత్తం 221 గురుకుల (100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలు) పాఠశాలల్లో ఒకే రకమైన విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ఆయా సొసైటీ గైడ్‌లైన్లు విడివిడిగా ఉండడంతోపాటు టీచర్ల నియామకానికి సంబంధించిన నియమ, నిబంధనలు, సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి.
ప్రస్తుతం చేపట్టబోయే టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు ఒకే విధానం, సర్వీస్‌రూల్స్‌ను పెట్టాలని మంగళవారం ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. అన్ని గురుకులాల్లో ఒకే విధంగా టీచర్ల నియామకానికి బీఈడీని అర్హతగా తీసుకోనున్నారు. వచ్చే జూన్ చివరికల్లా జనాభాప్రాతిపదికన 221 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో 5, 6 తరగతులను ప్రారంభించేందుకు ఆయా సంక్షేమ శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కూళ్లలోనే జూనియర్ కాలేజీల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.
బాలికల కోసం 25, బాలుర కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏడాది సమయం పట్టనున్నందున, అప్పటివరకు అందుబాటులో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, అద్దెభవనాల్లో గురుకులాలను ప్రారంభించనున్నారు.