ఘనత చెప్పుకోవడం ప్రచారం కాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి తాను సాధించిన ఘనతలు, సాధించిన పురస్కారాల గురించి చెప్పుకోవడం, ఆ పురస్కారాలను ప్రచారం కోసం వాడుకోవడం వేర్వేరని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బజాజ్ గ్రూపు సంస్థల చైర్మన్ రాహుల్ బజాజ్, అందులో తాను పద్మభూషణ్ అవార్డు గ్రహీతనని పిటిషన్‌లో చెప్పుకోవడం తప్పుకాదంది. ఆ అవార్డును వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. విజయవాడకు చెందిన నాగోతు సత్యానారాయణ సత్య డిజిటల్స్ పేరుతో ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారం చేస్తున్నారు.
తనపై నమోదు చేసిన కేసులో రాహుల్ బజాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అందులో తనకొచ్చిన పద్మభూషణ్ పురస్కారం గురించి ప్రస్తావించారని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు.పిటిషనర్ చేసిన అభ్యర్థనను ఆమోదించడం లేమంటూ అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.