హ్యాపీ జర్నీ
⇒అరచేతిలోనే పార్కింగ్ ప్రాంతాలు..
⇒నీరు నిలిచే ఏరియాలు సైతం ప్రత్యక్షం
⇒‘ట్రాఫిక్ లైవ్’కు కొత్త హంగులు
⇒వారం రోజుల్లో అందుబాటులోకి..
సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమేష్ షాపింగ్ కోసం తన కారులో బేగంబజార్‌కు వచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో వాహనం ఎక్కడ పార్క్ చేయాలో.. ఫ్రీ పార్కింగ్ ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. వర్షం వచ్చిందంటే నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తాయి. కీలక రోడ్డులో ఉన్న నీరు నిలిచే ప్రాంతాలు (వాటర్ లాగింగ్ ఏరియా) ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతాయి. అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందికి గురవడం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ సమస్యలకు నగర ఐటీ సెల్ పరిష్కారం చూపిస్తోంది. ఇప్పటికే సిటిజన్ ఫ్రెండ్లీ విధానాల్లో భాగంగా ట్రాఫిక్ విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’ యాప్‌లో ప్రత్యేక విభాగాలకు పొందుపరుస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ అదనపు హంగులు మరో వారం రోజుల్లో సెల్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
పార్కింగ్.. నో పార్కింగ్..
నగరంలోని అన్ని రహదారులు, ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని అక్కడి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ఈ విభాగాలను రూపొందించారు. హై ఎండ్ ఫోన్ ఉన్న వాహన చోదకుడుకు ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు తన వాహనాన్ని ఎక్కడ నిలుపుకోవాలో తెలుసుకోవాలంటే ‘లైవ్’ యాప్‌లోకి వెళ్తే చాలు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ పరిజ్ఞానం.. సదరు వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు సమీపంలో ఉన్న ‘పెయిడ్, ఫ్రీ పార్కింగ్’ వివరాలు అందిస్తుంది. దీంతో పాటు అవి ద్విచక్ర వాహనాల కోసమా? తేలికపాటి వాహనాల కోసమా? వాటి కెపాసిటీ ఎంత? తదితర వివరాలను మార్కింగ్, పాప్‌అప్స్ రూపంలో అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న నో పార్కింగ్ ఏరియాలను స్పష్టంగా చూపిస్తుంది. దీనిద్వారా వాహనదారులు ‘పోలీస్ చలాన్’కు, ‘టోవింగ్స్’కు గురయ్యే అవకాశం తప్పుతుంది.
‘వాటర్ లాగింగ్’ ఏరియాలూ..
వర్షాకాలంతో పాటు ఓ మాదిరి వర్షానికీ నగరంలోని అనేక రహదారులపై నీరు నిలవడం పరిపాటి. ఇలాంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో.. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహన చోదకులకు తెలియదు. దీంతో సదరు వ్యక్తి ఆయా ప్రాంతాలకు వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటారు. దీనికి పరిష్కారంగా ఈ యాప్‌లో నగర వ్యాప్తంగా ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా మార్కింగ్ చేశారు. గడిచిన కొన్నేళ్ల పరిస్థితుల్ని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. తద్వారా వాహనదారుడు వర్షం కురిసినప్పుడు తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలనూ ఎంచుకోవడానికి యాప్‌లోని ‘వాటర్ లాగింగ్’ ఏరియాల సమాచారం ఉపకరిస్తుంది.
పాదచారులకు ఉపయుక్తంగా..
ఐటీ సెల్ ఇన్‌చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ ప్రత్యేక విభాగంలో కేవలం వాహన చోదకులకే కాక.. పాదచారులు, సాధారణ ప్రయాణికులకు ఉపయుక్తమైన సమాచారం పొందుపరుస్తున్నారు.నగరంలోని తూర్పు మండలంలో నివసించే వ్యక్తికి దక్షిణ మండలంలో బస్టాప్స్ ఎక్కడ ఉన్నాయో, ఆటో స్టాండ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కాదు. పద్మవ్యూహాన్ని తలపించే రోడ్లపై పలువురిని పదేపదే అడిగితే తప్ప ఈ ‘గమ్యం’ చేరుకోలేరు. సామాన్యులకు ఈ సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో ఐటీ సెల్ ఈ విభాగంలో ప్రాంతాల వారీగా బస్టాండ్లు, ఆటో స్టాండ్ల వివరాలు మార్కింగ్ చేసింది.కొత్త ప్రాంతానికి వెళ్లిన వ్యక్తి ఈ యాప్ ద్వారా దారి చూసుకుంటూ అవసరమైన చోటుకు చేరుకోవచ్చు.