మేల్కొంటున్నారు!
నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు
వాహనదారుల్ల పెరిగిన అవగాహన
జరిమాన పెంపు, చార్జీషీట్‌లే కారణం
సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి. సిగ్నల్ జంప్‌లు, రాంగ్‌రూట్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ చేసేందుకు వాహనదారులు జంకుతున్నారు. ఒకపక్క జరిమానాలు పెంపు, మరోపక్క పెండింగ్ చలానా దారులపై చార్జిషీటు దాఖలు చేసి, కోర్టులో హాజరుపర్చడమే ఇందుకు ప్రధాన కారణం. వాహనదారుల్లో అవగాహన పెరగడం వల్లనే ఉల్లంఘనలు తగ్గాయని అధికారులు భావిస్తున్నారు.గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 8,79,251 నమోదుకాగా ఈ ఏడాది మూడు నెలల్లో 7,17,528 కేసులు నమోదు అయ్యాయి.
అంటే గతేడాది కంటే ఈ ఏడాది 1,61,723 కేసులు తగ్గాయి. ఒకపక్క నగరంలో వాహనాల సంఖ్య పెరిగినా..ఉల్లంఘన కేసులు తగ్గడం గమనార్హం. మూడు నెలల నుంచి పెండింగ్ చలానాలు వసూలుపై ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, ఎస్.కె.చౌహాన్‌లు దృష్టి సారించి చార్జిషీట్ విధానాలకు తెరలేపడం మూలంగా 5,15,643 చలానాలను వాహనదారులు క్లియర్ చేశారు. తద్వారా ప్రభుత్వానికి జరిమానాల రూపంలో రూ.9,86,44,160 వచ్చాయి. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా పెరగడంతో వాహనదారుల్లో ట్రాఫిక్‌పై అవగాహన పెంచగలిగారు.
ప్రధాన కారణాలు ఇవే...
నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల బకాయిలు వసూలు చేసే ప్రక్రియ ప్రారంభం
మూడు కన్న ఎక్కువ చలానాలు ఉన్నవారిని కోర్టులో హాజరుపర్చడం
కూడళ్లలో మైక్‌ల ద్వారా ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం
సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనుల భరతం పట్టడం
త్వరలో ఉల్లంఘనులపై డేగకన్న పెట్టేందుకు ఇంటర్‌సెప్టర్ వాహనాలు రంగంలోకి దిగనున్నాయి.