సాక్షి, ముంబై: నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. రోడ్లకు ఇరువైపుల వాహనాలను పార్క్ చేసి ఉంచడం, అదేవిధంగా వాహనాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. వీటి పరిష్కార మార్గం కోసం అధికారులు ప్రణాళికలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. నగరలో నిత్యం దాదాపు 20 లక్షల వాహనాలు రోడ్లపై సంచరిస్తున్నాయి. పార్కింగ్ సమస్య పరిష్కారంతోనే నగర రోడ్లపై రద్దీ తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే 20 ఏళ్ల వరకు పార్కింగ్ సమస్య పరిష్కారానికి వివిధ రవాణా నిపుణులు, ప్రభుత్వ ప్రణాళికాధికారులు, కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో.. వీధుల వెంబడి పార్కింగ్ చేసే వాహనాల చార్జీలను మాత్రమే పెంచడం ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని, రైల్వే స్టేషన్ల సమీప ప్రాంతాల వద్ద పార్కింగ్ సౌకర్యాలను కల్పించడం ద్వారా రోడ్ల పక్కన నిలిపిన ప్రైవేట్ వాహనాలను పూర్తిగా తొలగించవచ్చని రవాణా నిపుణులు అశోక్ దాతర్ అభిప్రాయపడ్డారు. లండన్‌తో పోల్చుకుంటే ఇక్కడ పార్కింగ్ రుసుము చాలా తక్కువని, గంటకు కనీసం రూ.100 విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేస్తున్న పార్కింగ్ రుసుమును పెంచాలని బీఎంసీ ప్రతిపాదించింది. నగరంలో రూ.60, పశ్చిమ శివారు ప్రాంతాల్లో రూ.40, తూర్పు శివారు ప్రాంతాల్లో రూ.20 పెంచాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా,రోడ్డులో 30 శాతం స్థలం వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణకు గురవుతోందని అధికారులు అంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంటీఎస్‌యూకు చెందిన అధికారి ఒకరు అన్నారు. ప్రస్తుతం నగరంలో 78 శాతం మంది ప్రజలు రైళ్లు, బస్సులలో ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా రైల్వే స్టేషన్ల ఆవరణలో పార్కింగ్ కోసం కనీసం 200 మీటర్ల వసతి కల్పించాలని, నగరవాసులకు పార్కింగ్ సౌకర్యాన్ని సక్రమంగా కల్పించాలని, అధిక చార్జీలను విధిం చడం సమంజసం కాదని ట్రాన్స్‌పోర్ట్ అండ్ అర్బన్ ప్లానింగ్‌కు చెందిన సీనియర్ అధికారి వి.పథక్ అభిప్రాయపడ్డారు.