ముంబైలో భారీ వర్షాలు.. హై అలర్ట్..!
ముంబైః భారీవర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాణిజ్యనగరంలో జన జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్ లు, ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచీ పడుతున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ఉదయం ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైల్వే ట్రాక్ లపై నీరు నిలిచిపోవడంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పశ్చిమ, మధ్య రైల్వే కు చెందిన అనేక సబర్బన్ రైళ్ళు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సియాన్-కుర్లా మధ్య రైల్వే ట్రాక్ లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, కారణంగా ముంబైనుంచీ బయల్దేరాల్సిన, ముంబైకి రావాల్సిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సైతం అరగంట నుంచీ గంట వరకూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే మార్గాలు మళ్ళించడం, కాన్సిలేషన్స్ వంటి మార్పులేమీ లేవని, కేవలం ఆలస్యం మాత్రమే అవుతున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముంబైకి దగ్గరలోని థానె, పాల్ఘర్, రాయ్ ఘడ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో అహ్మదాబాద్, పూనె, నాసిక్, గోవాలనుంచి ముంబైకి చేరే మార్గాలన్నింటిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాగల 48 గంటల్లో ముంబైతోపాటు, కొంకణ్ తీరప్రాంతాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా రాష్ట్రంలోని పోలీస్, అగ్నిమాపక, ఎన్డీ ఆర్ ఎఫ్ విభాగాలకు హై అలర్ట్ ప్రకటించింది. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.