ఏ రాశి మీది?... నక్షత్రమేది? | Haritaharam program on cm kcr review | Sakshi
Sakshi News home page

ఏ రాశి మీది?... నక్షత్రమేది?

Published Sat, Jul 2 2016 3:27 AM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

ఏ రాశి మీది?... నక్షత్రమేది? - Sakshi

ఏ రాశి మీది?... నక్షత్రమేది?

మొక్కల ఉద్యమానికిజాతక బలం!
* ప్రజల జన్మ నక్షత్రం, రాశులనుబట్టి మొక్కల పంపిణీ
* రెండో విడత హరితహారంపై ఉన్నతస్థాయి సమీక్షలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్:
మీది రోహిణి నక్షత్రమా..? అయితే నేరేడు మొక్క నాటండి! మీ రాశి కర్కాటకమా? అయితే మోదుగ మొక్క నాటండి!! మొక్కలకు, నక్షత్ర, రాశులకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఆకుపచ్చ తెలంగాణ సాధనలో భాగంగా సకల జనులను భాగస్వాములను చేసేందుకు ప్రజల జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా మొక్కల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొక్కల ఉద్యమానికి జాతక బలాన్ని జోడించాలని, తద్వారా ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంలా జరిగేలా చూడొచ్చని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత హరితహారంపై శుక్రవారం సచివాల యంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో జన్మ నక్షత్రం, రాశులను బట్టి మొక్కలను పెంచే పద్ధతి ఎప్పట్నుంచో అమల్లో ఉందన్న కేసీఆర్...జన్మ నక్షత్రం, రాశులనుబట్టి ఎవరు ఏ మొక్క నాటితే మంచిదనే విషయంలో జ్యోతిష్యులు, పండితులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. అందువల్ల ప్రజలు కోరిన మొక్కలు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ఆయా వివరాలను సీఎంకు అందించారు.అందరూ పాల్గొనాలి...
సమీక్ష సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్కూలు విద్యార్థి నుంచి సీఎం వరకు అన్ని స్థాయిల పౌరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే ఏడాది 46 కోట్ల మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలుస్తుందని అన్నారు. ‘‘గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలి. చెరువులు, రిజర్వాయర్లు, నదులు, రోడ్ల పక్కన మొక్కలు నాటాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మార్కెట్ యార్డులు, ఆర్టీసీ, సింగరేణి సంస్థల ప్రాంగణాలు, పోలీసుశాఖ కార్యాలయాలు, స్టేషన్ల ప్రాంగణాలు, ప్రార్థనా ప్రదేశాలనూ ఇందుకోసం వినియోగించుకోవాలి.

ప్రజలు ఇంటింటా మొక్కలు నాటేలా సర్పంచులు, కార్యదర్శులు చొరవ తీసుకోవాలి. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ‘యానిమల్ ట్రాప్స్’ ఏర్పాటుకు కలెక్టర్లు, మంత్రులు నిధులు వెచ్చించాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హరితహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. కవి సమ్మేళనాలు, ఉర్దూ ముషాయిరాలు, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు.4న సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం...
హరితహారాన్ని ఎలా చేపట్టాలనే అంశంపై ప్రభుత్వ శాఖలన్నీ ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకొని ఈ నెల 4న సీఎస్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశమై కార్యక్రమానికి తుదిరూపం ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటిపారుదల, రోడ్లు, భవనాలశాఖల మంత్రులూ ఈ భేటీలో పాల్గొనాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement