ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం
శాసనమండలిలో మంత్రి సునీత
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్ర జలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సభ్యులు సోమవారం సభ దృష్టికి తెచ్చారు. ధరలు పెరగడానికి కారణాలేమిటి? వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని సభ్యులు రత్నాబాయి, రుద్రరాజు పద్మరాజు(కాంగ్రెస్) ఆదిరెడ్డి అప్పారావు(వైఎస్సార్‌సీపీ) తదితరులు ప్రశ్నించారు.
పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత సమాధానమిస్తూ.. రెండు నెలలుగా ఉల్లి, టమటా ధరలు పెరిగాయని, ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ధరలను అదుపు చేసేందుకు జాయింట్ కలెక్టర్ల వద్ద రూ.15 లక్షల వరకు నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు బజార్లలో ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తున్న వారిని తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని ఆదిరెడ్డి అప్పారావు కోరారు. అలా తొలగిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సునీత చెప్పారు.