వేషాలేయకు...
‘‘వేషాలు వేయకు.. నోరు అదుపులో పెట్టుకో! ఎక్కువగా మాట్లాడితే కోస్తా.. నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.. ఇలా తిట్ల పర్వానికి దిగింది ఆకతాయిలు కాదు ... రోడ్డు మీద తిరిగే ఆవారాగాళ్లంతకన్నా కాదు ... వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు ఎమ్మెల్సీ. ఒకరిపై ఒకరు రాజమహేంద్రవరం కార్పొరేషన్ సాక్షిగా మాటల తూటాలు వదులుకున్నారు.
వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు ఎమ్మెల్సీ. ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘‘వేషాలు వేయకు.. నోరు అదుపులో పెట్టుకో! ఎక్కువగా మాట్లాడితే కోస్తా.. నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.. ఇలా ఒకరినొకరు దూషించుకున్నారు. ఇది చూసిన వారంతా ‘వార్’నాయనో! ఇదేం గొడవ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘డబ్బాలు కొట్టుకుంటున్నావ్, వేషాలు వేయకు, నోరు అదుపులో పెట్టుకో, చూసుకుందాం.. కోస్తా, నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు.. ఇవీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు మంగళవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో మాట్లాడిన మాటలు. ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ వాగ్వివాదానికి దిగడంతో కార్పొరేటర్లు, అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. సాప్ నుంచి తాను నిధులు తీసుకొచ్చానని, అందుకు సంబంధించిన జీవో చూపిస్తూ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి నాలుగు రోజుల క్రితం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ‘ఎప్పుడో లేటర్ ఇచ్చాను అంటున్నారు. అప్పడు ఏ పార్టీలో ఉన్నాడో’ అంటూ గోరంట్ల ఆదిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పరిధిలోకి రాకుండా నీ పని నీవు చూసుకోవాలని, ఇవన్నీ నీవు చేస్తుంటే నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, తాను చవటలమనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. దీనికి ఆదిరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీగా నిధులు తేచ్చే అవకాశం తనకూ ఉందని పేర్కొన్నారు. డబ్బాలు కొట్టుకోకూడదని గోరంట్ల అన్నారు. ఎవరు ఏమిటో అందరికీ తెలుసని, వేషాలు వేయొద్దంటూ చురక అంటించారు. తన నిజాయితీ అందరికీ తెలుసని, నీ సంగతీ కూడా ప్రజలకు తెలుసంటూ ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒకానొక దశలో బుచ్చయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘కోస్తా, ఉంటే ఉండు లేకపోతే బయటకు పో’ అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కల్పించుకుని ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యారు.
పార్టీ ఆదేశాల మేరకు తాను చేస్తానని ఆదిరెడ్డి చెప్పారు. అయితే మిత్రధర్మం ఎక్కడుందంటూ ఆకుల ప్రశ్నించారు. ఇరువురి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరడంతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కల్పించుకుని సర్దిచెప్పారు. సమావేశం జరుగుతున్న తీరు సినిమా షూటింగ్‌ను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కౌన్సిల్లోనే కాకుండా మేయర్, కమిషనర్ ప్రతినెలా కార్పొరేటర్లతో సమావేశమై ఆయా డివిజన్లలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు ఎంత మేర జరిగాయో సమీక్షించుకోవాలని సూచించారు.