రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఈ నెల 2, 3 తేదీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంన గర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే కురిసిన కుండపోత, భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి.
గత నెల 22 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 39.7 మిల్లీమీటర్లు (ఎం.ఎం.) కాగా ఆ కాలంలో 166 ఎం.ఎం. నమోదైంది. ఏకంగా 318 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేకాలంలో నిజామాబాద్ జిల్లాలో 804 శాతం అధిక వర్షం కురిసింది. సాధారణంగా ఆ వారం రోజుల్లో నిజామాబాద్‌లో కురవాల్సిన వర్షపాతం 37.2 ఎం.ఎం.లు కాగా 336.1 ఎం.ఎం.లు కురిసింది. మెదక్ జిల్లాలో 633 శాతం అధికంగా వర్షం కురిసింది. ఆ జిల్లాలో ఆ వారంలో సాధారణంగా 36.2 ఎం.ఎం.ల వర్షపాతం ఉండాలి. కానీ ఏకంగా 265.3 ఎం.ఎం.లు నమోదైంది.