బాటిల్‌పై బాదేస్తున్నారు! | heavy rates for the water bottles in the bastands | Sakshi
Sakshi News home page

బాటిల్‌పై బాదేస్తున్నారు!

Published Sat, Aug 19 2017 3:58 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

బాటిల్‌పై బాదేస్తున్నారు!

బాటిల్‌పై బాదేస్తున్నారు!

బస్టాండ్లలో వాటర్‌ బాటిళ్లకు అడ్డగోలు రేట్లు
రూ.20 నీటి సీసా రూ.25కు విక్రయం.. 
ఎమ్మార్పీని ఏమార్చి బిల్లులు ..జనానికి తప్పని తిప్పలు


సాక్షి, హైదరాబాద్‌ : ..ఇది ఈ ఒక్కచోటే జరుగుతున్న తంతు కాదు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్ల సీసాలను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. బాటిల్‌ ఎమ్మార్పీ ధర రూ.20 కాగా.. ఏకంగా రూ.5 అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతు న్నారు. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా గట్టి చర్యలు తీసుకోవడం లేదు.

సొంత లోగో.. అయినా ఆగని దోపిడీ!
ఇటీవల ఆర్టీసీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లలో కేవలం బిస్లరీ కంపెనీ మంచినీటి సీసాలనే విక్రయించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ నీటి సీసాపై బిస్లరీ వివరాలతోపాటు ఆర్టీసీ లోగో కూడా ముద్రిస్తున్నారు. నాసిరకం నీటి విక్రయాల నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ ప్రకటించింది. దీనిపై ఇతర కంపెనీలు కోర్టును ఆశ్రయించటంతో ఆ కేసు కొనసాగుతోంది. ఆ సంగతి అటుంచితే... ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త సమస్యకు కారణమైంది.

సాధారణంగా బస్టాండ్లలో మంచినీటి బాటిల్స్‌ సహా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి అమ్ముతుంటారు. ఇదంతా తెలిసినా ఆర్టీసీ నియంత్రించడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ లోగోతో వచ్చిన వాటర్‌ బాటిల్స్‌ను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆర్టీసీకి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో.. వాటి అసలు ధర (రూ.20)ను తెలియజేస్తూ స్టిక్కర్లు అతికించి చేతులు దులుపుకొన్నారు. వాటిని ఖాతరు చేయని వ్యాపారులు రూ.25 చొప్పున అమ్ముతున్నారు.

నీటి ప్లాంట్ల ఊసే లేదు
ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఎమ్మెల్సీగా ఉండగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 32 ఆర్టీసీ బస్టాండ్లలో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ఇవి ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వీటిల్లో పది మాత్రమే పనిచేస్తున్నాయి. నీటిని శుద్ధి చేసి ఉచితంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచటం దీని ఉద్దేశం. పేద ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అన్ని  బస్టాండ్లలో దశలవారీగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది.

కానీ వ్యాపారులకు మేలు చేసేందుకే అన్నట్టుగా ఆర్టీసీ వీటి ఏర్పాటును పూర్తిగా విస్మరించింది. కేవలం మామూలు నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుండటంతో ఆ నీటిని తాగేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో కచ్చితంగా బాటిల్‌ నీటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్‌ సహాæ కరీంనగర్, నిజామాబాద్‌ లాంటి రద్దీ బస్టాండ్లలో కూడా మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేయలేదు.

కళ్లు మూసుకున్న ప్రజాప్రతినిధులు
మంచినీటి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు. ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఈ విషయంలో స్పందించ లేదు. బ»స్టాండ్లలో ప్రయాణికుల వసతి మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్‌ల నుంచి ప్రజాప్రతినిధులకు లేఖలు అందాయి. కానీ గడచిన ఏడాది కాలంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మంచినీటి శుద్ధి ప్లాంటును ప్రతిపాదించలేదు. బస్టాండ్లలో  సింహభాగం దుకాణాలు ఎమ్మెల్యేల అనుచరులవే కావటమే దీనికి కారణం.

ఎమ్మార్పీకి అమ్మితే నష్టమట
తమకు సరఫరా అయ్యే నీటి సీసాల్లో కొన్ని లీకేజీలతో వస్తున్నాయని, ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఎమ్మార్పీ ధరలకు నీటి సీసాలు అమ్మితే నష్టం వస్తుందని దుకాణదారులంటున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ధర పెంచి అమ్ముతున్నామని పేర్కొంటున్నారు. అంటే.. పరోక్షంగా అధికారుల సమ్మతితోనే ఈ దందా నడుస్తోందని స్పష్టమవుతోంది.


ఈయన పేరు మేకల నాంపల్లి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామం. ఓ పనిపై కరీంనగర్‌ వచ్చి సొంతూరికి తిరుగుపయనమయ్యాడు. దాహం వేయటంతో బస్టాండ్‌లో మంచినీళ్ల బాటిల్‌ కొనేందుకు వెళ్లాడు. రూ.25 చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. ఆయన ఊరికి బస్‌ టికెట్‌ ధర రూ.16. వాటర్‌ బాటిల్‌ ధర మాత్రం రూ.25. చివరికి అంత ధర పెట్టలేక దాహం తీర్చుకోకుండానే బస్సెక్కాడు. అదే బస్టాండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టిఫిన్‌ సెంటర్‌ ఇది. ఈ నెల 13న ఓ ప్రయాణికుడు ఇందులో వాటర్‌ బాటిల్‌ కొనగా.. రూ.25కు బిల్‌ ఇచ్చారు. నిజానికి ధర రూ.20 మాత్రమే. పైగా బిల్‌పై వాటర్‌ బాటిల్‌ పేరు కాకుండా ‘మిస్లేనియస్‌’ అని రాశారు. సరిగ్గా ఆ దుకాణం ముందే ఆర్టీసీ కంట్రోలర్‌ కూర్చుని ఉండటంతో ప్రయాణికుడు ఆయనకు ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోకపోవటంతో ఫోన్‌లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు ఆ కంట్రోలర్‌ను హెచ్చరించి దుకాణం ముందు మంచినీటి సీసా ధర రూ.20 అని సూచిస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా బోర్డు ఏర్పాటు చేయలేదు.

బస్టాండ్లలో ఇదీ పరిస్థితి..
♦ కరీంనగర్‌ బస్టాండ్‌కు రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో ఎక్కడ చూసినా నీటి సీసాలు అమ్మే దుకాణాలే. శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందుబాటులో ఉంచాలన్న ఆలోచన ఆర్టీసీకి రావడం లేదు.

♦ కేంద్రం ప్రతిపాదించిన స్మార్ట్‌ సిటీ జాబితాలో వరంగల్‌ ఉంది. ఇక్కడి హన్మకొండ బస్టాండ్‌కు నిత్యం 35 వేల మంది వరకు ప్రయాణికులు వస్తారు. ఇక్కడా నీటి శుద్ధి ప్లాంటు లేదు.

♦ మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో నీటి శుద్ధి ప్లాంటు మరమ్మతుకు చేరి మూతపడింది. అధికారుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో కథనం రావటంతో ఇటీవలే దాన్ని పునరుద్ధరించారు.

♦ రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్‌లలో 32 చోట్ల నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నా.. అందు లో 20 వరకు పనే చేయటం లేదు.



అధికారులు ప్రతిపాదిస్తే చూస్తాం
ఏ డిపోకు ఏ అవసరాలుంటాయో పరిశీలించి తదనుగుణంగా హైదరాబాద్‌లో ఉండే ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిపోలకు కొత్త భవనాలు, కొత్త బస్సులు, బస్టాండ్లలో వసతుల కల్పన.. ఇలా అన్ని విషయాలపై సమీక్షల్లో చర్చించి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాల విషయంలో మాత్రం వారి తీరు విస్తుపోయేలా ఉంటుంది. ఎందుకంటే.. ఆయా బస్టాండ్లలో మంచినీటి ప్లాంటు ఎందుకు అవసరమో వివరిస్తూ విడిగా ప్రతిపాదన ఉన్నతాధికారులకు అందజేయాలి. అలా ప్రతిపాదన వస్తే దాని ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించి చర్యలు తీసుకుంటామనేది ఉన్నతాధికారుల వాదన. దీనిపై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే... ఇప్పటివరకు తమకు నీటి శుద్ధి ప్లాంట్లు కావాలంటూ డిపో అధికారుల నుంచి ప్రతిపాదనలు రాలేదని పేర్కొనటం విశేషం.

వాటర్‌ బాటిళ్ల ధరలను తెలిపే స్టిక్కర్‌లు ఇవి. చల్లని బాటిల్‌ రూ.21, మామూలు బాటిల్‌ రూ.20 చొప్పున అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కానీ.. దీన్ని అతికించిన వెంటనే ధర కనపడకుండా ఇలా చించేయడం, వేరే కాగితాలు అతికించటం చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు ఎవరికీ కన్పించకుండా దుకాణాల పైభాగంలో అతికించి వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement