సిటీలో చలి
ఉత్తరాది గాలులతో గజగజ
మరో ఐదు రోజులపాటు ఇదే పరిస్థితి...
గ్రేటర్‌లో ఒక్కసారిగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
సిటీలో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం 12.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్ప రికార్డు ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరిగిందని, ఈ పరిస్థితి మరో ఐదు రోజులపాటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సిటీబ్యూరో: గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న తేమ గాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నారుు. ఆదివారం తెల్లవారు జామున కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 12.9 డిగ్రీలకు పడిపోవడంతో చలితీవ్రత అనూహ్యంగా పెరిగింది. నాలుగేళ్ల తరవాత నవంబరు నెలలో ఈ స్థారుులో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. 2012 నవంబరు 18న నగరంలో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా..ఆదివారం 12.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. చలితీవ్రత పెరగడంతో ఉదయం ఐదు గంటలకే నిద్రలేచే నగరవాసులు ఎనిమిదైనా ముసుగు తీయడం లేదు. వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులు చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, ఆస్తమా బాధితులు, వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరో ఐదు రోజులపాటు చలితీవ్రత ఇదే స్థారుులో ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల 48 గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. తెల్లవారు జామున సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లక పోవడమే ఉత్తమమని సూచించింది. చలికి పెదాలు, కాళ్లు, చేతులు, చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండగా, శ్వాస సంబంధ సమస్యలు రెట్టింపు అయ్యారుు. ఆస్తమా బాధితులు స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఇటీవల ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో 40 శాతం మంది శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు కనిష్టంగా 16 నుంచి 16.8 వరకు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 13 డిగ్రీలకంటే తక్కువ నమోదవుతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో గత పదిహేను రోజులుగా చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
పొంచి ఉన్న స్వైన్ ఫ్లూ..
నగర వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్ ఉన్నట్లు ఇప్పటికే వైద్యుల పరిశోధనలో తేలిన విషయం తెలిసిందే. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో ఈ వైరస్ మరింత బలపడుతుంది. దీనికి వాతావరణ కాలుష్యం తోడవుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఫ్లూ కేసులు నమోదవుతున్నారుు. ఎన్నడూ లేని విధంగా గతేడాది 1800పై స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 35 కేసులు నమోదు కావడం విశేషం. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హైరిస్క్ గ్రూప్ బాధితులు, శిశువులు, గర్భిణులు ఈ సీజనల్‌లో సాధ్యమైనంత వరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లక పోవడమే మంచిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వెటర్లు, జర్కిన్ల అమ్మకాలపై పెద్దనోట్ల ఎఫెక్ట్
చలి భారీ నుంచి శరీరాన్ని కాపాడుకునేందు ప్రత్యామ్నాయాలపై జనం దృష్టి సారించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నేపాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇమ్లీబన్‌బస్‌స్టేషన్, కోఠి, ఛాదర్‌ఘాట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహా ఇన్నర్‌రింగ్‌రోడ్డు వెంట ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. అరుుతే వినియోగదారులు తమకు కావాల్సిన స్వెటర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్స్ ఎంపిక చేసుకుని పెద్దనోట్లు ఇవ్వగా వారు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. చేతిలో డబ్బులు ఉండి కూడా తమకు అవసరమైన వస్తువును కొనుగోలు చేయలేక పోతున్నారు. చలిబారి నుంచి శరీరాన్ని కాపాడుకోలేక గ్రేటర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.