'ఫొటో షూట్ కోసమే హెల్మెట్ తీశారు'
హైదరాబాద్: నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆకస్మిక పర్యటనల ద్వారా పరిశీలిస్తున్న నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా వాహనం నడిపారంటూ కొన్ని మీడియాలతో పాటు సోషల్‌మీడియాలోనూ హల్‌చల్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటో సైతం ప్రత్యక్షమైంది. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మేయర్‌కు ఈ-చలాన్ ద్వారా రూ.100 జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు.
అయితే గురువారం మధ్యాహ్నం ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులకు వివరణ ఇచ్చిన మేయర్ కార్యాలయం రామ్మోహన్ హెల్మెట్ పెట్టుకునే వాహనం నడిపారని పేర్కొంది. కేవలం ఫొటో షూట్ కోసమే ఆయన హెల్మెట్ తీశారంటూ అందుకు సంబంధిచిన ఫొటోలను ట్రాఫిక్ పోలీసులకు అందించింది.
కొందరు పాత్రికేయులు చేసిన విజ్ఞప్తి మేరకు కేవలం ఫొటో కోసమే తాను తాత్కాలికంగా హెల్మెట్‌ను తీసినట్లు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో మేయర్‌కు పంపాలని భావించిన ఈ-చలాన్‌ను రద్దు చేసినట్లు ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.