మనసున్న మా‘రాజా’
పంజగుట్ట: ‘మానవ సేవే మాధవ సేవ’గా భావించిన అతను రోడ్డుపై పడి ఉన్న అభాగ్యులను అక్కున చేర్చుకుని సేవచేస్తున్నాడు. వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ముందుకు రాకపోయినా తనే స్వయంగా వారికి అవసరమైన అన్ని సేవలు చేస్తున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో రాజా. 18 ఏళ్ల క్రితం బెంగళూరులో ‘హోం ఆఫ్ హోప్’ పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాదిమందికి చేయూతనందించిన రాజా తెలుగు రాష్ట్రాల్లోనూ తన సేవలు విస్తరింపజేస్తానని తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
1998లో మథర్ థెరీస్సాను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ఇందుకుగాను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని 18 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించాడు. తరువాత దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తతృతం చేశానన్నాడు. సేవచేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని పేర్కొంటున్న రాజా తన ఆశ్రమం స్త్రీ, పురుషులు, పిల్లలకు వేర్వేరుగా వసతి కల్పిస్తున్నట్లు తెలిపాడు. తన భార్య దేవకృప, ముగ్గురు పిల్లలు ఇందులో భాగస్వాములవుతున్నట్లు తెలిపాడు. ‘హోమ్ ఆఫ్ హోప్’లో ప్రస్తుతం 540 మంది ఆశ్రమం పొందుతున్నారని, వారికి మూడు పూటలా భోజనం, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపాడు. రాజా సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి. సిఎన్‌ఎన్, ఐబీఎన్ మీడియా ఆధ్వర్యంలో ముఖేష్ అంబానీ చేతులమీదుగా ‘రియల్ హీరో 2010’ అవార్డు అందుకున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనను స్వయంగా అభినందించారన్నారు. స్టార్‌ప్లస్‌లో ఆజ్‌కీ రాత్ జిందగీ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్ అభినందనలు అందుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం ‘బెంగళూరు ఎంజిల్’ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ సమాజ సేవ 2013 అవార్డు అందించారు. హైదరాబాద్‌లోనూ తన సేవా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.