ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ అంటే ఏంటో తెలియాలంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆనంద్’ను చూడాలి. ఇది ఓ మంచి కాఫీ లాంటి మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ తీసే దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన రెండో సినిమా. ఆత్మాభిమానం, ఇండిపెండెంట్ భావాలు కొంచెం ఎక్కువ గల ఓ యువతి తన లైఫ్‌లో ఎదుర్కొనే సవాళ్లు, లవ్, ఫ్రెండ్‌షిప్ వంటి వాటిని తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. వారి ఆలోచనలు, డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ప్రతిబింబిస్తాయి. హీరోగా రాజా, హీరోయిన్‌గా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించారు.
పరిణతి గల ప్రేమ
ఈ మూవీలో లవ్ స్టోరీ చాలా నేచురల్‌గా, హానెస్టీగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్‌ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో ఎటువంటి భారీ కాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తొలుత 2000లో ‘డాలర్ డ్రీమ్స్’ తీశారు. ఇది విమర్శకుల మెప్పు రూపొందింది. సెకండ్ మూవీ ‘ఆనంద్’ కోసం చాలా మంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. చేసేది లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సాయం కోరగా ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయడం ‘ఎన్‌ఎఫ్‌డీసీ’కి ఇదే తొలిసారి.
పద్మారావ్ నగర్‌లోనే...
ఆనంద్ స్టోరీని పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు. హీరోయిన్ గా తొలుత ఆసిన్, సదాను అనుకున్నారు. చివరికి రాజా, కమలినీ ముఖర్జీతో పూర్తి చేసేశారు. హైదరాబాదులో తానుండే పద్మారావ్ నగర్‌లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్.
కమలి పాత్రకి సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతని కూడా అవార్డు వరించింది. శేఖర్ కమ్ముల హోవర్డ్ యూనివర్శిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే సబ్‌మిట్ చేసారనే విషయం చాలా మందికి తెలియదు. ‘ఆనంద్’ సినిమాను తమిళంలో ‘నినైత్తాలే’ పేరుతో రీమేక్ చేశారు.
ఫార్ములా సినిమాలకు భిన్నంగా...
ఆనంద్ మూవీ, చిరంజీవి భారీ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఒకే రోజు రిలీజయ్యాయి. అయినా... ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ‘ఆనంద్’. ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా చూస్తారు. మీరు ఇప్పటికీ చూడక΄ోతే కచ్చితంగా ఓ సారి చూసేయండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment