హైదరాబాద్ లో హై అలర్ట్
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా బలగాలు
-నగరంలో ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లు పట్టుపడిన నేపథ్యంలో విస్తృత తనిఖీలు
శంషాబాద్ : నగరంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ఏజెంట్లు పట్టుబడడం, టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు, శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం నుంచి జూలై 6వ తేదీ వరకూ హైఅలర్ట్ ప్రకటించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని రకాల పాసులు రద్దుచేశారు. సందర్శకులను అనుమతించడంలేదు. ఎయిర్‌పోర్టుకు వచ్చేవారు ఎయిర్ టికెట్లు, ఐడీ కార్డులు తెచ్చుకోవాలని అధికారులు విజ్ఢప్తి చేశారు.
అలాగే నగరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. షాపింగ్ మాల్స్‌లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్, సైబర్‌టవర్ సహా మరికొన్ని ప్రదేశాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.