సాక్షి, హైదరాబాద్: దేశ పౌరసత్వం వ్యవహారంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. రమేశ్ భారత పౌరుడు కాదంటూ విచారణ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను, దానిని సమర్థిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వుల అమలును 6 వారాల పాటు నిలిపివేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కంటితుడుపుగా కమిటీ విచారణ
కేంద్ర హోంశాఖ తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్ర వారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ చేపట్టారు. రమేశ్ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిటీ కంటి తుడుపుగా విచారణ జరిపిం దన్నారు. రమేశ్ పౌరసత్వం కోసం దర ఖాస్తు చేసుకున్నాక జర్మనీ వెళ్లారని, ఆ ఒక్క అంశాన్నే కమిటీ పరిగణనలోకి తీసుకుందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేసినా, వాదనలు వినిపించే అవకాశమివ్వలేదన్నారు. జర్మనీ పిటిషనర్ నివాస ప్రాంతమని, కాబట్టి పిటిషనర్‌కు అది విదేశం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని హోం శాఖ పట్టించుకోలేదని విన్నవించారు. అనం తరం కేంద్ర హోంశాఖ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ వాదనలు వినిపించారు.
పౌరసత్వ దరఖాస్తులో తాను 12 నెలల పాటు దేశంలోనే నివాసమున్నానని, మధ్యలో విదేశాలకు వెళ్లలేదని రమేశ్ తెలిపారని, అది తప్పుడు సమాచారం ఇవ్వడమేనని స్పష్టం చేశారు. ఇక ఫిర్యాదుదారు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తప్పుడు సమాచారమిచ్చిన రమేశ్‌కు దానిని సరిచేసుకునే అవకాశాన్ని విచారణ కమిటీ ఇచ్చినా, రమేశ్ వాస్తవాలు వెల్లడించలేదన్నారు. రమేశ్ ఎన్నికపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేయగా.. భారత పౌరుడు కాదని ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment