vemulawada mla
-
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఊరట
సాక్షి, హైదరాబాద్: దేశ పౌరసత్వం వ్యవహారంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. రమేశ్ భారత పౌరుడు కాదంటూ విచారణ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను, దానిని సమర్థిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వుల అమలును 6 వారాల పాటు నిలిపివేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంటితుడుపుగా కమిటీ విచారణ కేంద్ర హోంశాఖ తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్ర వారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ చేపట్టారు. రమేశ్ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిటీ కంటి తుడుపుగా విచారణ జరిపిం దన్నారు. రమేశ్ పౌరసత్వం కోసం దర ఖాస్తు చేసుకున్నాక జర్మనీ వెళ్లారని, ఆ ఒక్క అంశాన్నే కమిటీ పరిగణనలోకి తీసుకుందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేసినా, వాదనలు వినిపించే అవకాశమివ్వలేదన్నారు. జర్మనీ పిటిషనర్ నివాస ప్రాంతమని, కాబట్టి పిటిషనర్‌కు అది విదేశం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని హోం శాఖ పట్టించుకోలేదని విన్నవించారు. అనం తరం కేంద్ర హోంశాఖ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ వాదనలు వినిపించారు. పౌరసత్వ దరఖాస్తులో తాను 12 నెలల పాటు దేశంలోనే నివాసమున్నానని, మధ్యలో విదేశాలకు వెళ్లలేదని రమేశ్ తెలిపారని, అది తప్పుడు సమాచారం ఇవ్వడమేనని స్పష్టం చేశారు. ఇక ఫిర్యాదుదారు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తప్పుడు సమాచారమిచ్చిన రమేశ్‌కు దానిని సరిచేసుకునే అవకాశాన్ని విచారణ కమిటీ ఇచ్చినా, రమేశ్ వాస్తవాలు వెల్లడించలేదన్నారు. రమేశ్ ఎన్నికపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేయగా.. భారత పౌరుడు కాదని ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. -
ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వంపై తేల్చండి
- కేంద్ర హోం శాఖకు సుప్రీం కోర్టు ఆదేశం - 6 వారాల సమయమిచ్చిన ఉన్నత న్యాయస్థానం సాక్షి, న్యూఢిల్లీ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పౌరసత్వ నిర్ధారణపై 6 వారాల్లో తేల్చాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఎన్నిక చెల్లదంటూ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని, భారత పౌరుడు కాద ని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టులో రమేశ్ అప్పీలు చేయగా దీనిపై స్టే విధించింది. స్టేను తొలగించాలని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం గతే డాది ఆగస్టులో విచారించింది. భారత పౌరసత్వం కోరుతూ 2008లో రమేశ్ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందగోరే వారు కనీసం ఏడాది పాటు దేశంలో ఉండాలి. అయితే ప్రభుత్వ విచారణ జరిపగా 96 రోజులే ఉన్నట్లు తేల్చింది. దీంతో సమాధానం ఇవ్వాలంటూ హోం శాఖ రమేశ్‌కు నోటీసులిచ్చింది. ఇలాంటి పరిస్థితిలో త్రిసభ్య కమిటీతో విచారణ జరపాలని చట్టం చెబుతోందని, త్రిసభ్య కమిటీ వేయాలని హోం శాఖను రమేశ్ కోరారు. 2012లో త్రిసభ్య కమిటీతో విచారణ జరిపినా నివేదిక ఇవ్వలేదు. ఈ నివేదిక హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని పిటిషనర్ ధర్మాసనానికి విన్నవించడంతో రమేశ్ పౌరసత్వ స్థితిపై 3 నెలల్లో తేల్చాలని, సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించాలని 2016 ఆగస్టు 11న సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడ్డ కొంతకాలానికి కేంద్ర హోం శాఖ కోరిన గడువు పూర్తి కావడంతో సోమవారం మరోసారి శ్రీనివాస్ సుప్రీంను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలు కాలేదని కోర్టుకు విన్నవిం చడంతో.. 6 వారాల్లో కేంద్ర హోం శాఖ దీన్ని తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు బెదిరింపులు
ఆయన ఇంటిని పేల్చివేస్తామని కాల్.. బాంబు స్క్వాడ్ తనిఖీలు వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నివాసం సంగీత నిలయాన్ని పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారని తెలిసింది. శనివారం వేకువజామున ఎమ్మెల్యేకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్‌కాల్ చేసి ఆయన నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వా్వడ్తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాజన్న ఆలయంలోనూ తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే నివాసానికి పటిష్టమైన భద్రత కల్పించారు. టౌన్ సీఐ శ్రీనివాస్‌ను సంప్రదించగా, వీఐపీల రాకపోకలున్నందున తనిఖీలు చేశామన్నారు. -
చెన్నమనేని లలితా దేవి కన్నుమూత
⇒ సీఎం తదితరుల ప్రగాఢ సంతాపం ⇒ నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు వేములవాడ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు సతీమణి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తల్లి చెన్నమనేని లలితా దేవి (89) ఇక లేరు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. లలితమ్మ భౌతికకాయాన్ని బంధువులు, ప్రజల సందర్శనార్థం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని ఆమె నివాసానికి తరలించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మంత్రి ఈటల , ఎంపీలు వినోద్‌కుమార్, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇ. రవీందర్ తదితరులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలను గురువారం ఉదయం పదింటికి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరుగుతాయని ఎమ్మెల్యే రమేశ్ తెలిపారు. లలితమ్మకు రమేశ్‌తో పాటు ము గ్గురు కూతుళ్లున్నారు. లలితమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రమేశ్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ నేతలు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో, భూ పోరాటంలో, కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశాల్లో భర్తతో పాటు సమానంగా లలితమ్మ పాల్గొన్నారు. భర్తతో పాటుగా అజ్ఞాత జీవనం గడిపారు. అజ్ఞాతంలో ఉండగానే ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చారు. -
వేములవాడ ఎమ్మెల్యేకు మాతృవియోగం
వేములవాడ(కరీంనగర్): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి లలితాదేవి (80) అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భర్త రాజేశ్వర్ రావుతో కలసి అజ్ఞాతంలో పని చేశారు. రాజేశ్వర్ రావు ఇటీవలనే మృతిచెందారు. అప్పటి నుంచి అనారోగ్యం పాలైన లలితాదేవి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడు ఎమ్మెల్యే రమేష్ బాబు, జర్మనీలో ఉన్న కోడలు మరియా, మనమడు వరుణ్, మనమరాలు సంగీత హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చెన్నమనేని రాజేశ్వర్ రావు భార్య లలితాదేవి. రాజేశ్వర్ రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2009లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడు రమేశ్‌కు టికెట్ ఇప్పించారు. 2016 మే 9వ తేదీన ఆయన అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యాసాగరరావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
‘చెన్నమనేని’ అనర్హత కేసు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అనర్హత కేసు మరోసారి వాయిదా పడింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం మరోసారి విచారణకు వచ్చింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఈ కేసును తాను విచారించలేనని (నాట్ బిఫోర్ మీ) జస్టిస్ సి.నాగప్పన్ పేర్కొనడంతో ఈ కేసు మరో ధర్మాసనం ముందుకు వెళ్లనుంది.