చెన్నమనేని లలితా దేవి కన్నుమూత
⇒ సీఎం తదితరుల ప్రగాఢ సంతాపం
⇒ నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
వేములవాడ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు సతీమణి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తల్లి చెన్నమనేని లలితా దేవి (89) ఇక లేరు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. లలితమ్మ భౌతికకాయాన్ని బంధువులు, ప్రజల సందర్శనార్థం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని ఆమె నివాసానికి తరలించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మంత్రి ఈటల , ఎంపీలు వినోద్‌కుమార్, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇ. రవీందర్ తదితరులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అంత్యక్రియలను గురువారం ఉదయం పదింటికి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరుగుతాయని ఎమ్మెల్యే రమేశ్ తెలిపారు. లలితమ్మకు రమేశ్‌తో పాటు ము గ్గురు కూతుళ్లున్నారు. లలితమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రమేశ్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ నేతలు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో, భూ పోరాటంలో, కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశాల్లో భర్తతో పాటు సమానంగా లలితమ్మ పాల్గొన్నారు. భర్తతో పాటుగా అజ్ఞాత జీవనం గడిపారు. అజ్ఞాతంలో ఉండగానే ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చారు.