వార్డుల పునర్విభజనపైమీ వైఖరేంటి?
పభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు
విచారణ ఆగస్టు 5కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని వార్డులన్నింటినీ కూడా సమాన జనాభా ప్రాతిపదికన విభజించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్డుల పునర్విభజన నిమిత్తం 1996లో జారీ చేసిన జీఓ 570ని అమలు చేయడం లేదని, వార్డుల జనాభా మధ్య సగటున 15 శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతుంటే, అంతకుమించి తేడా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మలక్‌పేటకు చెందిన బీజేపీ నేత జీఆర్ కరుణాకర్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మంగళవారం విచారించారు.
కొన్ని వార్డుల్లో జనాభా 17 వేలు ఉంటే, మరికొన్ని చోట్ల 70 వేలు, ఇంకొన్ని చోట్ల 90 వేలు ఉందని, ఇలా ఉండటం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2011 లెక్కల ప్రకారం జనాభా 67,31,790 అని, దీనిప్రకారం 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు 15 శాతం మించకుండా చూస్తే 44 వేల జనాభా ఉండాలని వివరించారు. అయితే ప్రస్తుతం అలా లేదన్నారు. దీని ప్రభావం అభివృద్ధిపై పడుతోందని, తక్కువ జనాభా ఉన్న వార్డుకూ, ఎక్కువ జనాభా ఉన్న వార్డుకూ ఏకరీతిన నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ఎక్కువ జనాభా ఉన్న వార్డుల్లో అభివృద్ధి సాధ్యం కావడం లేదని వివరించారు.
అంతేకాక అనేక వార్డులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ల కింద కేటాయించారని వారు తెలిపారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాలంటే వార్డులను పునర్విభజన చేసి తీరాలన్నారు. అందువల్ల వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక పనులను వెంటనే ప్రారంభించేలా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు.