కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?
హైదరాబాద్ : హైకోర్టులో రెండోరోజు కూడా అగ్రిగోల్డ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ నిమిత్తం అగ్రిగోల్డ్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు, ఏపీ సీఐడీ చీఫ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, విలువలపై న్యాయస్థానం ఆరా తీస్తోంది. ఆస్తులు విక్రయిస్తే... బెంగళూరులో 172 ఎకరాలకు రూ.1500 కోట్లు, విజయవాడలో 170 ఎకరాలకు రూ.1000 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
న్యాయవాది వాదనలను ఏకీభవించని న్యాయస్థానం...ఆస్తుల విలువను ఎక్కువ చూపి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ, బెంగళూరులో ఆస్తులు అమ్మితే రూ.200 కోట్లు మించి రాదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టును తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. బినామీ ఆస్తులంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
కాగా డిపాజిట్లరకు తిరిగివ్వాల్సిన మొత్తాలను చెల్లించేందుకు వీలుగా తమ ఆదేశాల మేరకు జరగబోయే అగ్రిగోల్డ్ భూముల వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే వేలం నిమిత్తం కోర్టుకు సమర్పించిన ఆస్తుల్లో వేటినీ తాకట్టు పెట్టలేదంటూ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ సంస్థను ఆదేశించింది. ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాసనం ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది.