ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ఆలోచన చేయాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నిచోట్ల ఇంకుడు గుంతలున్నాయి? ఎన్నిచోట్ల లేవో పరిశీలించాలని పేర్కొంది. ఇంకుడు గుంతలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన ఒక కమిటీ వేయాలని స్పష్టం చేసింది. ఇంకుడు గుంతల ఏర్పాటుకు కొంత గడువునిచ్చి, అప్పటికీ ఏర్పాటు చేసుకోకుంటే నీటి కనెక్షన్లు రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీ పరిశీలించాలంది.
రెండు వారాల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాదులు చెప్పడంతో దాన్ని రికార్డ్ చేస్తూ తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ప్రభుత్వం అన్ని సూచనలు, సలహాలతో దీనిపై ఓ నివేదిక తయారు చేసి దానిని కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350ల ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం మరోసారి విచారించింది.