అర్ధరాత్రి హైడ్రామా... | High drama at night | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి హైడ్రామా...

Published Thu, Jun 29 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

అర్ధరాత్రి హైడ్రామా...

అర్ధరాత్రి హైడ్రామా...

- కుకునూర్‌పల్లికి శ్రవణ్, రాజీవ్‌
స్థానిక పోలీసుల హెచ్చరికలతో వెంటనే తిరుగుముఖం
 
హైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్‌(21), వల్లభనేని రాజీవ్‌ (31) పోలీస్‌ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులు రెండు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీకి తీసుకుని శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో జరిగిన ఘటనలను పునర్విచారించారు(క్రాస్‌ చెకింగ్‌). రాజీవ్, శ్రవణ్‌ శిరీషను హింసించడం వల్ల ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో స్పష్టం కావడంతో వీరిపై అదనంగా మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు.

ఈ నెల 16న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారో కస్టడీలోనూ అవే విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడుతుండటం కళ్లారా చూశామని వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానికి లేదన్న సమాధానమే ఇచ్చారు. ప్రియురాలు తేజస్వినిని, వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీషను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసిన విషయం వాస్తవమేనా అని రాజీవ్‌ను ప్రశ్నించగా.. వారిద్దరినీ దూరం చేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు.
 
మీడియా కళ్లుగప్పి..
కస్టడీలో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో హైడ్రామా మధ్య కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు మీడియాకు ఉప్పందించి.. అక్కడ పరీక్షల అనంతరం మీడియా కళ్లుగప్పి అడ్డదారిలో కుకునూర్‌పల్లికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకునూర్‌పల్లిలో అక్కడి పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. పది నిమిషాలు అక్కడ ఉంటే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, విషయం బయటకు పొక్కితే ప్రజలు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిం చడంతో బంజారాహిల్స్‌ పోలీసులు కుకునూర్‌ పల్లి పోలీస్‌స్టేషన్‌ బయటి నుంచే తిరుగుముఖం పట్టారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఇదేనా? ఈ స్టేషన్‌ వెనకాల ఉన్న క్వార్టర్స్‌కు వచ్చారా? ఎక్కడి నుంచి వెళ్లారు? అనే వివరాలను స్టేషన్‌ బయటే నిందితులను అడిగి నిమిషాల్లోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. తెల్లవారుజామున 5.30 గంటలకు మళ్లీ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement