సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని ప్రాంతంలోని జనాభాలో 90 శాతం మంది హిందువులు ఉన్నారు. 2001 జనాభా కన్నా 2011 జనాభా లెక్కల్లో హిందువుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. రాజధాని ప్రాంతానికి సంబంధించి సీఆర్‌డీఏ సమస్త సమాచారంతో ప్రచురించిన పుస్తకంలో ఈ వివరాలను పేర్కొంది. ఈ ప్రాంతంలో 2001లో హిందువుల జనాభా 91.1 శాతంగా ఉండగా.. అది 2011లో 90.9 శాతానికి తగ్గింది. కేపిటల్ రీజియన్‌లోని కొల్లూరు, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు. అలాగే కంచికచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో తక్కువగా ఉన్నారు.
ఇక ఈ ప్రాంతంలో ముస్లింల సంఖ్య పెరిగింది. 2001లో 6.9 శాతంగా ఉన్న ముస్లింలు.. 2011లో 7.3 శాతానికి పెరిగారు. కంచికచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండగా ఘంటసాల, నందివాడ, మోపిదేవి మండలంలో తక్కువగా ఉంది. క్రిస్టియన్లలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. 2001లో 1.8 శాతం క్రిిస్టియన్లు ఉండగా.. 2011లో 1.4 శాతం మంది ఉన్నారు. నందివాడ, ఫిరంగిపురం, గన్నవరం మండలాల్లో క్రిిస్టియన్ జనాభా ఎక్కువగా ఉండగా వత్సవాయి, చంద్రలపాడు, క్రోసూరు మండలాల్లో తక్కువగా ఉన్నారు. ఇక ఇతర మతస్తులు 0.1 శాతం మంది ఉన్నారు.
పెరిగిన ఎస్సీ జనాభా..
కేపిటల్ రీజియనల్‌లో గత 20 ఏళ్ల నుంచి ఎస్సీల జనాభా పెరుగుతోంది. ఎస్టీల జనాభా విషయంలో అతి స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కాగా 2011 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే.. రాజధాని ప్రాంతంలోని మురికివాడల్లో నివాసం ఉంటున్న కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 28 శాతం ప్రజలు మురికివాడల్లోనే నివసిస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురికివాడల్లో 61,128 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
రాజధాని ప్రాంత జనాభాలో 90 % మంది హిందువులు
Published Mon, May 9 2016 3:27 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement