‘మహా’ మలుపు
- హెచ్‌ఎండీఏలో సంస్కరణలకు శ్రీకారం
- అక్రమార్కుల భరతం పట్టడమే లక్ష్యం
- మహా నగరాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, సిటీబ్యూరో: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను సమూలంగా సంస్కరించే పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపక్రమించారు.
సంస్థ ప్రతిష్టను దిగజార్చిన ప్రణాళికా విభాగంలోని కొందరు అధికారుల భరతం పట్టడంతో పాటు పూర్వ వైభవం తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ పాలనా పగ్గాలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రాకు అప్పగించారు. అనుమతుల విషయంలో పారదర్శకతతో... అవినీతి రహితంగా... ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సీఎం కొత్త విధానాలకు పూనుకున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్న తరుణంలో హెచ్‌ఎండీఏలో అవినీతి, అక్రమాలపై భారీగా ఫిర్యాదులు అందాయి.
అదే సమయంలో ఏసీబీ దాడులు... అక్రమాలకు అడ్డుకట్ట పడ కపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఒక దశలో అసలు హెచ్‌ఎండీఏని ఏకంగా రద్దు చేయాలన్న దిశగా సమాలోచనలు చేసినట్లు వినికిడి. అయితే... హైదరాబాద్‌కు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఈ పని సరికాదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల జాబితా తెప్పించుకున్న సీఎం దశల వారీగా వారిపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఒత్తిళ్లకు తలొగ్గకుండా...
ఈ ఆపరేషన్‌లో నిజాయితీపరులు బలికాకుండా చూసే బాధ్యతను కొత్త కమిషనర్ శాలినీ మిశ్రాపై పెట్టినట్లు వినవస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించి.. అక్రమార్కులను ఏరివేయడంతో పాటు హెచ్‌ఎండీఏను గాడిలో పెట్టేందుకు ఆయన మార్గనిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. నగరం చుట్టు పక్కల 4 జిల్లాల పరిధిలోని 35 మండలాలను కలుపుతూ (849 గ్రామా లు) 7,257 చ.కి.మీ. మేర విస్తరించిన హెచ్‌ఎండీఏను అత్యున్నత ప్రణాళికా సంస్థగా తీర్చిదిద్దాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. అవసరమైతే మాస్టర్‌ప్లాన్‌లో మార్పులూ చేర్పులకూ వెనుకాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది.
అక్రమాలపై దృష్టి
భూ వినియోగ మార్పిడి (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఫైళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఉప్పందడంతో సీఎం ఆ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. నిజానికి ఈ అధికారం హెచ్‌ఎండీఏ పరిధిలో లేదు. నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో బడా రియల్టర్లు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసి సులభంగానే భూ వినియోగ మార్పిడి చేసుకుంటున్నారు. కన్జర్వేషన్ (అగ్రికల్చర్) జోన్ నుంచి రెసిడెన్షియల్‌కు... రెసిడెన్షియల్ జోన్ నుంచి కమర్షియల్‌కు ఎడాపెడా భూ వినియోగ మార్పిడి జరిగిపోయింది.
దీనికి హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన కొందరు అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్ కనెక్టివిటీ వంటివి లేకపోయినా చిన్నపాటి మార్పులతో పక్కాగా ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. నిబంధనల మేరకు అన్నీ సరిగ్గా ఉండటంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ వెంటనే అనుమతి ఇచ్చేస్తోంది. ఈ కార్యాన్ని చక్కబెట్టినందుకు ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారులు రూ.కోట్లలో దండుకొంటున్న విషయం ప్రభుత్వం పసిగట్టింది.
ఇలా ఒక్క లేఅవుట్‌కు అనుమతిచ్చినందుకు గతంలో ఓ కమిషనర్ రూ.5 నుంచి 10 కోట్లు వసూలు చేసిన విషయం సీఎం దృష్టికి వచ్చింది. దాంతో హెచ్‌ఎండీఏ అంటేనే అక్రమాల పుట్ట అన్న భావన ఆయనలో బలంగా నాటుకొంది. దీన్ని సంస్కరించేందుకు ప్రదీప్ చంద్ర లాంటి సీనియర్ అధికారులను నియమించినా అక్రమాలు ఆగలేదు. అసలు ఆ సంస్థ అధికారాలను తప్పించి వాటిని ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలని ఓ దశలో సీఎం భావించినట్లు సమాచారం.
ఇప్పటివరకు అనుమతిచ్చిన ఫైళ్లను పునఃపరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే...ఇందులో బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్త కమిషనర్‌గా శాలినీ మిశ్రా పగ్గాలు చేపట్టనుండటంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని అక్రమార్కులు హడలిపోతున్నారు.
కొత్త సారథిగా శాలినీ మిశ్రా
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ నూతన సారథిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలినీ మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో గత 9 రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడినట్లయింది. ఈ నెల 12న జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో హెచ్‌ఎండీఏకు ఇన్‌చార్జి కమిషనర్‌గా బి.జనార్దన్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులు దాటినా ఆయనకు ప్రస్తుత ఇన్‌చార్జి కమిషనర్ ప్రదీప్ చంద్ర చార్జి ఇవ్వకపోవడంతో హెచ్‌ఎండీఏను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారేమోనన్న వదంతులు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా శాలినీ మిశ్రాను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.