కోదండరాంకు మతి భ్రమించింది
రెండేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా: హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం మతిభ్రమించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. 60 ఏళ్ల అన్యాయాన్ని రెండేళ్లలో పూడ్చగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.35 వేల కోట్లతో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ‘‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుతుంటే కోదండరాంకు కనిపించ లేదా? అసెంబ్లీలో విపక్షాలు మాట్లాడినట్లుగానే ఆయన మాట్లాడుతున్నారు. మేధావి ముసుగులో ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దు. భూసేకరణ చేయకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాగుతుంది? చెరువులకు కృష్ణా, గోదావరి నదీ జలాలు రావాలంటే ఆకాశం మీద నుంచి పైపులు వేస్తారా? రాష్ట్రంలో పది జిల్లాల్లో లేని సమస్య ఒక్క మల్లన్నసాగర్ వద్దే కోదండరాంకు కనిపించిందా’’ అని ప్రశ్నించారు. రేవంత్ ఒక బచ్చాగాడని, అతని మాటలకు తాను స్పందించనని అన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కేసీఆర్ ఫాంహౌస్ భూములు కేటాయించాలంటూ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.