సర్కారు ఉక్కిరిబిక్కిరి
♦ కోదండరాం వ్యాఖ్యలతో ఉలికిపాటు
♦ ఏకంగా 12 మంది మంత్రులు విరుచుకుపడటంపై విమర్శలు
♦ కోదండరాంకు దన్నుగా విపక్షాలు, జేఏసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైందా..? టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోందా..? కోదండరాంపై కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేయడం చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో అలర్ట్ అయిన ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి ప్రారంభించారని, ఏకంగా 12 మంది మంత్రులు కోదండరాం విమర్శలను తిప్పికొడుతూ ప్రతి విమర్శలకు దిగారని అంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ విధానాలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించుకునే ప్రయత్నం చేస్తూనే జేఏసీ ఉనికిని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. మరోవైపు కోదండరాంకు విపక్షాలు, వివిధ జేఏసీలు మద్దతుగా నిలిచి ప్రభుత్వ తీరును తూర్పారపట్టడంతో అధికార పార్టీ వ్యూహం బూమరాంగ్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండేళ్లుగా అంశాల వారీగా అధ్యయనం..
రెండేళ్లుగా వివిధ రంగాల వారీగా, అంశాల వారీగా అధ్యయనం చేసిన తెలంగాణ జేఏసీ ప్రకటనలకే పరిమితం అయ్యింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, విద్యుత్, సాగునీటి రంగాలతోపాటు సింగరేణిపై జేఏసీ సబ్-కమిటీలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై టీజేఏసీ చైర్మన్ హోదాలో కోదండరాం జిల్లాల్లో పర్యటించారు. అనంతరం జేఏసీ తరపున నివేదికను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి అందజేశారు. రైతు ఆత్మహత్యలపై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. రైతుల ఆత్మహత్యల నివారణకు జేఏసీ కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఉద్యమ సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతాల్లోనూ జేఏసీ పర్యటించింది. కరువుపై కలెక్టర్ల సదస్సుకు ముందు వివిధ రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం జరిపి ప్రభుత్వానికి సూచనలు చేసింది. మొత్తంగా ఈ రెండేళ్ల పాటు అధ్యయనానికి, ప్రభుత్వానికి సూచనలు చేయడానికే పరిమితమైన జేఏసీ రెండేళ్ల సంబురాలు జరుగుతున్న సమయంలో విమర్శలకు దిగింది. భూసేకరణ విధానంపై తీవ్రంగా విరుచుకుపడిన కోదండరాం.. ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని కుండ బద్దలు కొట్టారు. గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తోందం టూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పుట్టించాయి.
జేఏసీ @ ప్రభుత్వం
కోదండరాం వ్యాఖ్యలపై మంత్రులంతా విరుచుకుపడటంపై చర్చ సాగుతోంది. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంగా తెలంగాణ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పెద్ద పాత్రనే పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో జేఏసీ బయటకు వెళ్లిపోవడం వెనుక సదరు పెద్దల ఆదేశాలు, ఒత్తిడి ఉన్నాయన్న ప్రచారం జరిగింది. గతంలో జేఏసీలో కీలకంగా వ్యవహరించిన వారికి కొన్ని పదవులు దక్కడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో తన మనుగడను కాపాడుకుంటూనే ప్రజల పక్షాన జేఏసీ ప్రభుత్వాన్ని నిలదీసిందంటున్నారు.
విమర్శలను స్వీకరించకుండా.. అమాత్యులంతా కోదండరాంపై ఒంటికాలిపై లేవడంతో పెద్ద దుమారమే చెలరేగింది. గతంలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలపై మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జేఏసీ చైర్మన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల మంత్రుల దిష్టిబొమ్మలు, ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కోదండరాం లేవనెత్తిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించడానికే మంత్రులు పరిమితమయ్యారు.