హోరా హోరీ..!
తార్నాకలో ఆసక్తికర పోరు
♦ రెండోసారి బరిలో నిలిచిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి
♦ టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ కూటమిలతో పోటాపోటీ
సాక్షి, సిటీబ్యూరో
తార్నాక..విద్యావంతులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాదాయవర్గాలు, చిరుద్యోగులు, రోజువారి కూలీలతో సమ్మిళితమైన ప్రాంతం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడితో ఇప్పుడది విస్తృతమైన పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తుతోంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బరిలో ఉండటంతో అందరూ ఈ డివిజన్‌పై దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆలకుంట సర్వసతి, బీజేపీ అభ్యర్థిగా సూదగాని లక్ష్మీగౌడ్, టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా కోళ్ల భవానీ యాదవ్‌తో పాటు సీపీఐ అభ్యర్థిగా రాపోలు శోభారాణి, బీఎస్పీ అభ్యర్థి సుభద్రలతో పాటు మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ - బీజేపీ మధ్యే నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
డివిజన్‌లోని ప్రధాన సమస్యలివే...
తార్నాకలో పద్నాలుగు వీధులతో పాటు లాలాపేట, మాణికేశ్వరీనగర్, రవీంద్రనగర్, ఓయూ క్యాంపులు, లక్ష్మీనగర్, శ్రీపురికాలనీ, సాయినగర్, అంబేద్కర్‌నగర్, ఇందిరానగర్, శాంతినగర్, ఆర్యనగర్, ఓల్డ్‌లాలాపేట, విజయడైరీ కాలనీలు అతి ముఖ్యమైనవి. ఇక్కడ పదేళ్లుగా నిలిచిపోయిన తార్నాక -లాలాపేట రోడ్డు విస్తరణ, కాలనీల మధ్య నుండి వెళ్లే ఓపెన్ నాలా, పురాతన మంచినీటి పైపులైన్లు, వినోభానగర్, సత్యనగర్‌లో నిత్యం కలుషితమయ్యే మంచినీరు, అర్హులకు పింఛన్లు రాకపోవటం, ట్రాఫిక్ రద్దీతో తార్నాకా జంక్షన్ మూత అంశాలు ప్రధాన సమస్యలు. ఇక్కడి జనాన్ని వేధిస్తున్న అంశాలు ఇవే.
డివిజన్ ముఖచిత్రం
మొత్తం ఓట్లు 59,735
పురుషులు 31,123
మహిళలు 28,607
ఇతరులు 5
పోటీలో ఉన్న అభ్యర్థులు
బండ కార్తీకరెడ్డి - కాంగ్రెస్
ఆలకుంట సరస్వతి - టీఆర్‌ఎస్
సూదగాని లక్షీగౌడ్ - బీజేపీ
భవానియాదవ్ - టీడీపీ రెబల్
రాపోలు శోభారాణి - సీపీఐ
బొల్లం సుభద్ర - బీఎస్పీ
బండ కార్తీకరెడ్డి - కాంగ్రెస్
ప్రచార సరళి: అతి పిన్న వయసులోనే నగర మేయర్ పదవి పొందిన కార్తీకరెడ్డి తార్నాక డివిజన్ నుండే రెండవ మారు పోటీ చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఐదేళ్లలో తాను మేయర్‌గా అందరికీ అందుబాటులో ఉన్నానని, రూ.46 కోట్లతో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ఆమె భరోసాతో ఉన్నారు. ఇప్పటికే డివిజన్ మొత్తాన్ని చుట్టేశారు. అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికీ వెళుతున్నారు. మరోసారి బలపర్చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
బలాలు(+): మేయర్‌గా పనిచే సిన సమయంలో వివిధ పథకాలను అమలు చేయటం, డివిజన్‌లో విస్తృత పరిచయాలుండటం, డివిజన్ పునర్విభజనలో 80 శాతం పాత ప్రాంతాలే ఉండటం, ఆర్థికంగా వనరులు పుష్కలంగా ఉండటం కార్తీకరెడ్డికి అనుకూలాంశాలుగా చెప్పవచ్చు.
బలహీనతలు(-): మేయర్‌గా ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయాలు చేయకపోవటం, తార్నాక మెయిన్ రోడ్డు విస్తరణ, ఓపెన్ నాలా అంశాలను పరిష్కరించలేకపోవటం, మాణికేశ్వరినగర్‌కు పూర్తి కొత్త కావటం ఒకింత మైనస్‌గా చెప్పొచ్చు.
ఆలకుంట సరస్వతి-టీఆర్‌ఎస్
ప్రచార సరళి: మాణికేశ్వరినగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షులు ఆలకుంట హరి సతీమణి సరస్వతి. ఈమె గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా టీఆర్‌ఎస్ పార్టీ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంత్రి పద్మారావు సల హాలు సూచనలతో అసంతృప్తులకు సర్ధిచెబుతున్నారు. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని ఆశిస్తున్నారు.
బలాలు(+): అధికార పార్టీ అభ్యర్థి కావడంతోపాటు మంత్రి పద్మారావు నియోజకవర్గానికి చెందిన ఏరియా కావటం, రాష్ట్రంలో అధికారం ఉండడం, ఉద్యమ ప్రభావం ఉన్న ఏరియా కావడం, పింఛన్‌దారులు, డుబల్ బెడ్‌రూం ఇళ్లు కావాల్సిన ఆశావహులు ఎక్కువగా ఉండటం అనుకూలాంశాలుగా చెప్పొచ్చు.
బలహీనతలు(-): ఇటీవలి వరకు సీతాఫల్‌మండి డివిజన్‌లో ఉన్న ఏరియా వ్యక్తి కావటంతో తార్నాక ఏరియా జనాలకు పెద్దగా పరిచయం లేకపోవటం. ఓటు రాజకీయాలకు పూర్తి కొత్త. సొంతపార్టీలో అసంతృప్తి.
సూదగాని లక్ష్మీగౌడ్ - బీజేపీ
ప్రచార సరళి: టీడీపీ-బీజేపీ అవగాహనలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. త్వరలో కేంద్రమంత్రులు, కిషన్‌రెడ్డిల ఆధ్వర్యంలో రోడ్డుషోలు నిర్వహించే పనిలో ఉన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆశీస్సులతో సీటు సంపాదించిన లక్ష్మీ ఆయన సలహాలు,సూచనలతో ముందుకు సాగుతున్నారు.
బలాలు(+): కేంద్రంలో అధికారంతో పాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుల సంపూర్ణ మద్దతు ఉండటం. వ్యాపారులు, ఉన్నత విద్యావంతులు తమతో కలిసివస్తారన్న విశ్వాసం. స్థానికంగా పరిచయాలు ఉండటం. ఆర్థికంగా బలంగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు.
బలహీనతలు(-): టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి పోటీలో ఉండటం, టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనకపోవటం, బలమైన ప్రత్యర్థులు ఉండటం, సొంత పార్టీలోనూ ఒకింత అసంతృప్తి ఉండటం మైనస్ అనొచ్చు.