‘డబుల్’ కసరత్తు
రంగంలోకి మంత్రి కేటీఆర్..
స్టీల్ ధరల్లో రాయితీ కావాలన్న బిల్డర్లు
29 చోట్ల 6842 ఇళ్ల టెండరు గడువు పెంపు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కష్టసాధ్యంగా మారింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బడా కాంట్రాక్టరర్లతో పాటు జీహెచ్‌ఎంసీలో వివిధ పనులు చేసే ‘లోకల్’ కాంట్రాక్టర్లకు అవకాశమిచ్చినా వారూ సానుకూలంగా స్పందించడం లేదు. రియల్ బిల్డర్లను కోరుతున్నప్పటికీ మొహమాటానికి సరే అంటున్నా వారూ మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సామాజిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కాంట్రాక్టర్లను కోరారు. బిల్లుల చెల్లింపునకు ఇబ్బంది ఉండబోదని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, స్టీలు ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా ఎస్కలేషన్ ఇవ్వాలని బిల్డర్లు కోరినట్లు తెలిసింది. కొంత సమయమిస్తే తాము టెండర్లు వేస్తామనడంతో బుధవారం వరకు మాత్రమే నగరంలోని 6,842 ఇళ్లకు సంబంధించిన టెండరుకు గడువుండగా, మరికొన్ని రోజులు పొడిగించేందుకు హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ల నుంచి తగిన స్పందన లేకపోవడంతో వీటికోసం ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా టెండర్ల గడువును పొడిగించారు. తాజాగా మరోమారు ఈ అవకాశం కల్పించి ఈనెల 7వ తేదీవరకు దీనికి గడువునిచ్చారు.
ఆసక్తి చూపని బిల్డర్లు
నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు తొలినుంచీ విముఖత చూపుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. చెప్పుకోదగ్గ స్పందన లేకపోవడంతో స్వయానా కేటీఆర్ స్థానిక బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ గృహాల నిర్మాణ వ్యయంలో దాదాపు 15 శాతం స్టీలుకే ఖర్చు కాగలదని, ప్రభుత్వం వీటి ధరలను నిర్ణయించినప్పుడు టన్ను స్టీలు ధర రూ. 30 వేలుండగా, ప్రస్తుతం రూ.40 వేలకు పెరగడంతో తమకు గిట్టుబాటు కాదని ఎస్కలేషన్ కోరినట్లు తెలిసింది. దాంతోపాటు ఐటీ మినహాయింపునివ్వాలని కోరారు. ఈ ఇళ్లకు సంబంధించి సిమెంట్ ధరల్లో తక్కువ ధరకు ఇప్పిస్తామని, ఇసుక ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటితోపాటు సర్వీస్ టాక్స్ కూడా లేదు. టైల్స్ లేకుండానే ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ, ముఖ్యంగా స్టీల్ ఎస్కలేషన్‌కు అవకాశమివ్వనిదే ఎందరు ముందుకొస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.