అదెలా సాధ్యం బాబూ?!
‘‘అమరావతిలో 2018 ఒలింపిక్స్..’’ జూలై 2న సీఎం ప్రకటన
‘‘అమరావతిలో అతిత్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం..’’
ఆగస్టు 20న పునరుద్ఘాటన
నాలుగేళ్లకొకమారు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడల పండుగ... ఒలింపిక్స్‌ను చంద్రబాబుగారు రెండేళ్లలో ఎలా నిర్వహించబోతున్నారో అర్ధం కాక నెల క్రితం అందరూ తలలు పట్టుకున్నారు. కానీ బాబు తప్పు సవరించుకోలేదు.. తన ఆకాంక్షను శనివారం పునరుద్ఘాటించారు. అమరావతిలో అతిత్వరలో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారట. అసలు ఒక రాష్ర్టప్రభుత్వానికి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఎంత ఖర్చవుతుంది? ఒలింపిక్స్ నిర్వహించే అవకాశమెలా వస్తుంది? దానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? ఇలాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం ఇలాంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడమేమిటని ప్రజలు విస్తుపోతున్నారు. 2020 ఒలింపిక్స్ టోక్యోలో నిర్వహించాలని ఎప్పుడో నిర్ణయమైపోయింది.
2024 ఒలింపిక్స్‌కు కూడా బిడ్డింగ్ పూర్తయిపోయింది. ఇక మిగిలింది 2028 ఒలింపిక్సే. అదీ ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఒక రాష్ర్టప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం లేదు. దేశం ప్రతిపాదించాల్సి ఉంటుంది. పరిపాలన, నిర్వహణా సామర్థ్యం, చట్టపరమైన చిక్కులు, క్రీడాగ్రామాల సదుపాయాలు.. ఇలా ఎన్నో అంశాలను పరిశీలిస్తారు. అనేక దశలలో వడపోత అనంతరం దేశాన్ని ఫైనల్ చేస్తారు. ఒలింపిక్స్ నిర్వహణంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికి ఒలింపిక్స్ నిర్వహించిన 10 దేశాలు దివాలా తీశాయట. బీజింగ్ ఒలింపిక్స్ నిర్వహించిన చైనా 42 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే 2.73 లక్షల కోట్లు. మరి అంత సామర్థ్యం ఏపీకు ఉందా? తెలుగుతేజం పివి సింధు ఒలింపిక్స్‌లో రజతం సాధించి దేశ ప్రతిష్టను దిగంతాలకు చాటిన నేపథ్యంలో చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు.
గోపీచంద్‌కు తమ హయాంలో భూమి కేటాయించడం వల్లనే ఇదంతా సాధ్యమైందని చంద్రబాబు ప్రకటించేశారు. ఎవరు ఏం సాధించినా దానిని తనకు ఆపాదించుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు. సెల్‌ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ఆయన తరచూ ప్రకటిస్తుండడం ఈ కోవలోనివే. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేస్తున్న ఇలాంటి ప్రకటనలు చూసి హైదరాబాద్‌లో పర్యటిస్తున్న స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కొచెపిన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ప్రకటనలు చేస్తే మా దేశంలో జైలులోనైనా పెడతారు.. లేదంటే పిచ్చాసుపత్రికైనా పంపిస్తారు’’ అని ముఖంపైనే చెప్పిపోయారు.
- సాక్షి, హైదరాబాద్