పార్టీని ఎట్లా బలోపేతం చేద్దాం?
* ఓటమి కారణాలను పక్కన పెట్టండి
* కాంగ్రెస్ నేతలతో సోనియా, రాహుల్
* ఓటమికి కారణాలపై హైకమాండ్ పెద్దలకు నివేదిక అందజేసిన పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓటమికి కారణాలేమిటో మాకు తెలుసు. ఆ విషయాన్ని పక్కనపెట్టండి. ఇకపై పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో చెప్పండి? ఏం చేస్తే పునర్ వైభవం తీసుకురాగలమో ఆలోచించండి. మీ దగ్గరేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉంటే చెప్పండి’’.. తమను కలసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న వ్యాఖ్యలివి. గురువారం ఢిల్లీ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డీకే అరుణసహా మహబూబ్‌నగర్ జిల్లా నేతలు సోనియా, రాహుల్‌ను విడివిడిగా కలిశారు.
తొలుత డీకే అరుణ నేతృత్వంలో నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య, జిల్లా ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ సోనియాగాంధీని కలసి తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చిన విషయాన్ని వివరిస్తూ సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ, నంది ఎల్లయ్య, వంశీచంద్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ‘‘తెలంగాణ అంతటా పార్టీ ఓడిపోయినప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం మెరుగైన ఫలితాలు సాధించాం. గతంలో జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలవగా, ఈసారి 5 సీట్లు వచ్చాయి.
అలాగే నాగర్‌కర్నూలు ఎంపీ సీటును గెలుచుకున్నాం’’అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఒకరిద్దరు నేతలు తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలను వివరించబోతుండగా సోనియా వారించారు. ‘ఆ విషయాన్ని పక్కనపెట్టండి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో చెప్పండి’ అని అడిగారు. దీంతో జిల్లా నేతలంతా ‘క్రియాశీలకంగా పనిచేసే వారికి పదవులు ఇవ్వండి. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహించండి’’అని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణలో పార్టీ పరాజయానికి గల కారణాల విశ్లేషిస్తూ టీపీసీసీ రూపొందించిన నివేదికను సోనియాకు అందజేశారు.
‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడ ంతో తెలంగాణలోనూ అవే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ ఇచ్చినా లాభం లేకపోయింది. ప్రధానంగా 18-35 ఏళ్ల యువకులు ఎక్కువశాతం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ పోరాటంవల్లే కేంద్రం అనివార్యంగా తెలంగాణ ఇచ్చిందనే భావన వారిలో నాటుకుపోయింది. అట్లాగే ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఉద్యోగులను కాంగ్రెస్‌వైపు తిప్పుకోలేకపోయాం. టీఆర్‌ఎస్‌పార్టీ తెలంగాణ విషయంలో ప్రజలను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు భావోద్వేగానికి గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్నా వాటిని ఖండించడంలో ఇబ్బంది పడ్డాం.
వీటికితోడు అభ్యర్థుల ఎంపిక సరిగా లేకపోవడం, ఎన్నికల సమయంలో సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం కూడా పార్టీ పరాజయానికి కారణాలయ్యాయి. ఎన్నికల్లో ఎంఐఎం, సీపీఐ పార్టీలతో పొత్తువల్ల కాంగ్రెస్‌కు నష్టమే తప్ప ప్రయోజనం కలగలేదు. పొత్తువల్ల టికెట్లు నష్టపోయిన పార్టీ నేతలు కాంగ్రెస్ ఓటమికి కృషి చేశారు’’అని ప్రధానంగా సోనియాకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది.
ఒకరిపై ఒకరు....
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను విడివిడిగా కలసిన నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పైకి మాత్రం ఎవరిపైనా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదని చెబుతున్నప్పటికీ జానారెడ్డి, డీఎస్, దామోదర రాజనర్సింహ వంటి సీనియర్ నేతలవల్లే పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలిస్తే సీఎం కావాలని భావించిన ఆయా నేతలు ముఖ్యమంత్రి పదవికి పోటీగా భావించిన వారిని ఎన్నికల్లో ఓడించేందుకు యత్నించారని, అందులో భాగంగా ప్రత్యర్థి అభ్యర్థులకు ఆర్థికంగా సాయం చేశారని ఆరోపించినట్లు తెలిసింది. మరోవైపు డీఎస్, జానారెడ్డి తదితరులు ‘పొన్నాల నాయకత్వ వైఫల్యంవల్లే పార్టీ ఓడిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల ఎన్నికల్లో సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో, అభ్యర్థులకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారు’అని ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.