
హైదరాబాద్ టూ ఐఎస్‌ఐఎస్
హైదరాబాద్: నగరం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లిన విద్యార్థులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్‌ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద బాట పట్టడం కలకలం రేపింది. మాస్టర్ డిగ్రీ కోసం లండన్ వెళ్లిన శాస్త్రీపురానికి చెందిన అలీ పెద్ద కుమారుడు మహ్మద్ అతీఫ్ వసీమ్ (28) పది రోజుల క్రితం సిరియాలో జరిగిన ఉగ్ర యుద్ధంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక్క వసీమే కాదు.. గతంలో కూడా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులై ఇరాక్, సిరియా వెళ్లేందుకు యత్నించిన అనేక మంది ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం.
ఉన్నత చదువులు చదివి కుటుంబానికి పెద్ద దిక్కు అవుతారని కలలు కంటున్న తల్లిదండ్రులకు వసీమ్ లాంటి ఉదంతాలు దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్ జాడలు నగరంలో ఏడాదికాలంగా కనిపిస్తున్నాయి. మొదటిసారిగా గతేడాది ఆగస్టులో 18 మంది యువకులు ఫేస్‌బుక్ ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితులై ఇరాక్ వెళ్లేందుకు యత్నిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమబెంగాల్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరినీ అక్కడి పోలీసులు నగరపోలీసులకు అప్పగించారు. దీంతో అప్పట్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి పంపారు. వారు ఎలాంటి నేరాలు చేయకున్నా ఇప్పుడిప్పుడే అటువైపు ఆకర్షితులయ్యారని, వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహంచి పంపించామని అప్పట్లో పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. వారిపై నిఘా మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా, దుబాయ్‌లో స్థిరపడ్డ నగరానికి చెందిన ఓ యువతి (21)ని ఆమె స్నేహితురాలు ఐఎస్‌ఐఎస్‌లో చేర్చేందుకు టర్కీ వరకు తీసుకెళ్లింది. అయితే, చివరి క్షణాల్లో మనసు మార్చుకుని ఆ యువతి రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది. బజార్‌ఘాట్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ (32) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో 2002-08లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత టక్సాస్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అమెరికాలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేసిన అతనికి ఫేస్‌బుక్ ద్వారా ఇంగ్లాడ్‌కు చెందిన జోసఫ్ అలియాస్ ఆయేషా (26)తో (ఇస్లాం మతం స్వీకరించి దుబాయ్‌లో ఉంటుంది) పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఆమె ఆమె సల్మాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ప్రపంచం మొత్తం ఇస్తామిక్ రాజ్యం స్థాపించేందుకు పవిత్ర యుద్ధం చేయాలని ఆమె కోరడంతో సల్మాన్ అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలోనే జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ముషీరాబాద్‌కు చెందిన కొందరు ఇంజినీరింగ్ చేసి యువకులు కూడా సిరియా వెళ్లేందుకు కుట్ర పన్నగా పోలీసులు మూడు నెలల క్రితం బైండోవర్ చేశారు.
సిరియాలో ఎవరైనా ఇంకా ఉన్నారా...
వసీమ్‌లా సిరియాకు వెళ్లిన వారిలో నగరానికి చెందిన వారు ఎవరైనా విద్యార్థులు, యువకులు ఉన్నారా? అనే విషయంపై నగర నిఘా విభాగం పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నగరం నుంచి చదువు, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా తమకు వీసా మంజూరైన దేశంలోనే ఉన్నారా? అక్కడి నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లారా అనే విషయంపై దృష్టి సారించారు. గతంలో ఐఎస్‌ఐఎస్ వైపు ఆకర్షితులైన సుమారు 87 మంది యువకులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీరంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారా? లేదా అనేది ఆరా తీస్తున్నారు. వారి ఫేస్‌బుక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు.
అప్రమత్తమైన పోలీసులు...
ఐఎస్‌ఐఎస్ జాడలు మరోసారి తెరపైకి రావడంతో జంటపోలీసు కమిషనరేట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌లు, బస్సు స్టేషన్‌లు, లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.