ఆ వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఏవీ!
సెమిస్టర్ ముగిసిపోతున్నా చేతిలో ఉద్యోగాల ఆఫర్లు ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాతి పరిణామాల నేపథ్యంలో క్యాంపస్ నియామకాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆందోళనల కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే కంపెనీలు ఏవీ రావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి కనీసం పది కంపెనీలు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ శాఖకు వచ్చాయని, కానీ ఈసారి ఒకే ఒక్క కంపెనీ వచ్చిందని, కనీసం 60 శాతం మంది విద్యార్థులకు చేతిలో ఉద్యోగాలు లేవని ఆ శాఖకు చెందిన ఓ విద్యార్థి చెప్పారు.
2015 ఆగస్టు - డిసెంబర్ నెలల మధ్యలో 42 కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వచ్చాయి. కానీ, 2016లో ఇప్పటివరకు కేవలం 15 కంపెనీలు మాత్రమే వచ్చాయి. జనవరి నెలలోనే నియామకాలు చాలావరకు తగ్గిపోయాయని, యూనివర్సిటీ పేరు ప్రతిష్ఠలు దారుణంగా దెబ్బతినడంతో కంపెనీలు ఇటువైపు చూడటం మానేస్తున్నాయని స్టూడెంట్ ప్లేస్‌మెంట్ సమన్వయకర్త ఒకరు అన్నారు. ఒకటీ ఆరా కంపెనీలు వచ్చినా, ఇంటర్వ్యూలలో కూడా అసలు ఈ గొడవ ఏంటి, దాని పరిణామాలేంటనే అడుగుతున్నారట.
ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏప్రిల్ 9 నుంచి జాబ్ ఫెయిర్ ఒకటి నిర్వహించనున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల విషయంలో మంచి గుర్తింపు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెబితే ఇప్పుడు నిరసనలే గుర్తుకొస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు తగ్గితే కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని ఇటు ఆందోళనకారులతో పాటు యూనివర్సిటీ వర్గాలను కూడా విద్యార్థులు కోరుతున్నారు.