ఇక్కడ జోరు..అక్కడ బ్రేక్! | hyderabad metro works down! | Sakshi
Sakshi News home page

ఇక్కడ జోరు..అక్కడ బ్రేక్!

Published Mon, Nov 16 2015 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

ఇక్కడ జోరు..అక్కడ బ్రేక్! - Sakshi

ఇక్కడ జోరు..అక్కడ బ్రేక్!

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల కలల మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రధాన నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో రేయింబవళ్లు వడివడిగా జరుగుతున్నాయి. పాతనగరంలో మాత్రం పనులు సా..గుతున్నాయి. ఫలక్‌నుమా మెట్రో డిపో సహా పాతనగరంలో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమవుతుండడంతో ఓల్డ్‌సిటీకి మరో రెండేళ్లు ఆలస్యంగా..

అంటే 2017 జూన్ నాటికి మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాగోల్-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మియాపూర్-ఎస్.ఆర్.నగర్ మార్గంలో 2016 మార్చి, ఏప్రిల్ మాసంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.

ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1), జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్2), నాగోల్-రహేజా ఐటీపార్క్ (కారిడార్3)మార్గంలో మొత్తం 72 కి.మీ మార్గంలో ఆరు దశలుగా పనులు చేపట్టిన విషయం విదితమే.  ఇప్పటివరకు సుమారు 52.29 కి.మీ మార్గంలో మెట్రో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఆయా ప్రాంతాల్లో మెట్రో పిల్లర్లు, వాటిపై పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది.

ఆయా ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణం పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. కాగా మెట్రో మూడు కారిడార్లు ముగిసే ప్రాంతాల్లో భారీ టర్మినల్ స్టేషన్ల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సన్నాహాలు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో మిగిలిన 81 ఆస్తుల సేకరణ ప్రక్రియను హెచ్‌ఎంఆర్ సంస్థ వేగవంతం చేసింది.
 
పనుల పురోగతి ఇలా..
నాగోలు-మెట్టుగూడా(స్టేజి1) మార్గంలో మొత్తం 8.01 కి.మీ మార్గంలో పూర్తిస్థాయిలో 315 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఏడు మెట్రోస్టేషన్లు తుదిరూపు సంతరించుకుంటున్నాయి. మియాపూర్-ఎస్.ఆర్‌నగర్(స్టేజి2)మార్గంలో 11.90 కి.మీ మార్గంలో పూర్తిస్థాయిలో 456 పిల్లర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది.

ఇక మెట్టుగూడా-బేగంపేట్(స్టేజి3)మార్గంలో 8.25 కి.మీ మార్గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బేగంపేట్-శిల్పారామం(స్టేజి4)మార్గంలో 11.03 కి.మీ మార్గంలో 430 పిల్లర్లకు ఇప్పటివరకు 279 పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. ఇక ఎస్.ఆర్.నగర్-ఎల్బీనగర్‌మార్గం(స్టేజి5)మార్గంలో 17.31కి.మీమార్గంలో 653 పిల్లర్లకు 559 పిల్లర్ల ఏర్పాటు పూర్తయ్యింది.

ఇక జేబీఎస్-ఫలక్‌నుమా(స్టేజి6) మార్గంలో 15.19 కి.మీ రూట్లో 588 పిల్లర్లకు 123 పిల్లర్లు ఏర్పాటయ్యాయి. పాతనగరంలో అనుమతుల రాక ఆలస్యమవడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఓల్డ్‌సిటీలో పాత అలైన్‌మెంట్ ప్రకారమే పనులు జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా నిర్మాణ సంస్థకు స్పష్టంచేసినప్పటికీ రాతపూర్వక అనుమతులు ఇంకా తమకు అందలేదని ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
టెర్మినల్ స్టేషన్ల నిర్మాణం ఇలా..
మెట్రో కారిడార్లు ముగిసే ప్రాంతాల్లో ఆరు టెర్మినల్ స్టేషన్లను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది. మూడు కారిడార్ల పరిధిలో ఆరు చోట్ల ఇలాంటి భారీ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. ఎల్బీనగర్,మియాపూర్(కారిడార్1),నాగోలు,రాయదుర్గం(కారిడార్3),పరేడ్‌గ్రౌండ్స్,ఫలక్‌నుమా(కారిడార్2)లో టెర్మినల్ స్టేషన్లను నిర్మించనున్నారు.

ఈ స్టేషన్లు సుమారు 200 మీటర్ల పొడవున ఉంటాయి. రైళ్లు ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్‌కు మారేందుకు,మరమ్మతుల నిర్వహణ,అత్యవసర సమయాల్లో రైళ్లను నిలిపివేయడానికి ఈ స్టేషన్లను వినియోగించుకుంటారు. మొత్తం ఆరు టెర్మినల్ స్టేషన్లలో మూడింటిని సమీప మెట్రో డిపోలతో అనుసంధానమై ఉంటాయి. మియాపూర్,నాగోల్,ఫలక్‌నుమా మెట్రో డిపోలతో అక్కడి స్టేషన్లను అనుసంధానిస్తారు.మరో మూడు చోట్ల టెర్మినల్ స్టేషన్లు మాత్రమే ఉంటాయి.
 
‘హైదరాబాద్ మెట్రో’కి ప్రపంచ ఖ్యాతి
- ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి
రామచంద్రపురం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఖ్యాతి గడిస్తుందని ఆ ప్రాజెక్టు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాలలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సుమారు రూ.20 వేల కోట్లతో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు ఇప్పటివరకు 20 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పూర్తరుుందని, 50 కిలోమీటర్ల మేర పిల్లర్లు నిర్మించామని వివరించారు.

2012లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 90 శాతం ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతోందని, 2017 నాటికి పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ం ప్రపంచంలో గల 100 ఉత్తమ ప్రాజెక్టుల్లో ఒకటిగా బెస్ట్ ఇంజనీర్స్ అవార్డును కైవసం చేసుకుందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎన్.శేషారెడ్డి, కళాశాల అడకమిక్ డెరైక్టర్ ఎంవీఎస్ సుబ్బారావు, పీజీ కోర్సుల డెరైక్టర్ రంగారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement