హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్ (www.hyderabadpolice.gov.in) రూపుమారుతోంది. సమకాలీన అవసరాలకు తగ్గట్టు ఆధునిక హంగులతో అప్‌డేట్ చేస్తున్నారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెల్ తుదిమెరుగులు దిద్దుతున్న కొత్త వెర్షన్ వచ్చే వారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
నగర పోలీసు విభాగం 2008లో ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై పోలీసు వెబ్‌సైట్ల స్ఫూర్తితో ఏర్పాటు చేసిన సిటీ పోలీసు అధికారిక వెబ్‌సైట్ ఆ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి సేవలు ప్రారంభించింది. నాటి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు ఠాణాలు, అధికారుల వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు తదితరాలను చేర్చారు. ఈ ఏడేళ్ల కాలంలో ప్రజల అవసరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీనికితోడు గడిచిన ఏడాదిన్నర కాలంలో నగర పోలీసు విభాగం టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోంది.
ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి అప్లికేషన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా పోలీసు వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఐటీ సెల్‌కు అప్పగించారు. నగర ప్రజలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఐటీ సెల్ వాటిని క్రోడీకరిస్తూ కొత్త వెర్షన్ డిజైన్ చేసింది. దీన్ని త్వరలో నగర పోలీసు కమిషనర్ ఆవిష్కరించనున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించనున్నారు.