డీడీ పెరిగితే పీడీ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మొన్న... అక్కడికక్కడ కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేయడం.
నిన్న... వాహనం స్వాధీనం చేసుకుని... న్యాయస్థానంలో హాజరుపరచడం.
నేడు... పరిమితికి మించి మద్యం తాగినట్లు తేలితే జైలు.
రేపు... పదే పదే డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ (డీడీ) చిక్కిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగం.
...ఇదీ హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారుల యోచన. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో అత్యంత ప్రమాదకరంగా పరిగణించే వాటిలో డ్రంకన్ డ్రైవ్ ప్రధానమైనది. దీని వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు అమాయకులైన ఎదుటి వారికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే దీనిపై ట్రాఫిక్ కాప్స్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో పదేపదే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
ఫైన్ నుంచి జైలు వరకు...
ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్ (ఎంవీ) యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. ఈ చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో గతంలో ట్రాఫిక్ పోలీసులు ‘నిషా’చరులను ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 184 బి) కిందే నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ ఇన్ టెన్ కంట్రీస్ (ఆర్‌ఎస్-10) కింద 2011 నవంబర్‌లో ట్రాఫిక్ పోలీసులకు అందిన ఉపకరణాలను వినియోగించి ‘నిషా’చరులకు పక్కాగా చెక్ చెబుతున్నారు. ఆర్‌ఎస్-10తో వచ్చిన బ్రీత్ ఎనలైజర్లు ఆల్కహాల్ క్వాంటిటీని నిర్థారించడంతో పాటు ప్రింట్ అవుట్ రూపంలో ఇస్తాయి. ఇది కోర్టులో ఆధారంగా పని చేస్తోంది.
డ్రైవ్‌లో మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి వాహనాన్ని అప్పటికప్పుడే సీజ్ చేస్తున్నారు. చోదకుడిని మాత్రం మరుసటి రోజు కోర్టుకు రమ్మని చెప్పి పంపిస్తున్నారు. ఎనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్‌ను ఆధారంగా చూపి కోర్టులో ప్రవేశపెట్టగా... రూ.2 వేల జరిమానా కట్టి వీరు బయటకు వచ్చేవారు. ఆపై ట్రాఫిక్ పోలీసులు ‘నిషా’చరులను జైలుకు పంపేలా ఎంవీ యాక్ట్‌లో ఉన్న నిబంధనలను వినియోగించుకున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 185 (1) (బి) ప్రకారం వాహన చోదకుడు మద్యం తాగినట్టు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో తేలితే... జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు నిషాచరులను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ద్వారా జైలుకు పంపిస్తున్నారు.
ఇకపై ‘పీడీ’...
‘నిషా’చరులను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. వారాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌ను ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. వీటి పరిధుల్లో చిక్కిన వారి పూర్తి వివరాలను సెంట్రలైజ్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఓ వ్యక్తి ఎన్నిసార్లు, ఏ మోతాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ ఎక్కడెక్కడ చిక్కాడు అనేది తేలిగ్గా గుర్తించే అవకాశం ఏర్పడింది.
దీనికోసం పట్టుబడిన వ్యక్తి పేరు, చిరునామా, వాహనం, డ్రైవింగ్ లెసైన్స్ నెంబర్ వంటి పూర్తి వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ డేటాబేస్‌ను విశ్లేషిస్తున్న అధికారులు పదేపదే చిక్కుతున్న వారిపైన, మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి గరిష్టంగా 12 నెలల పాటు జైల్లో ఉంచాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.